Omicron: ‘కొత్త వేరియంట్‌.. వింటర్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ సవాలే’

వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్’తో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ వేరియంట్‌ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌ నిర్వహణకూ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా తెలిపింది...

Published : 30 Nov 2021 18:36 IST

బీజింగ్‌: వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్’తో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ వేరియంట్‌ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌ నిర్వహణకూ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా తెలిపింది. ‘ఈ క్రీడాపోటీల నిర్వహణ క్రమంలో ఒమిక్రాన్‌తో ముడిపడి ఉన్న సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నాం’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మంగళవారం అన్నారు. అయితే.. మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనాకు చాలా అనుభవం ఉందని, వింటర్ ఒలింపిక్స్ సజావుగా సాగుతాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఒమిక్రాన్‌పై సకాలంలో సమాచారం అందజేసినందుకుగానూ దక్షిణాఫ్రికాను చైనా అభినందిస్తున్నట్లు తెలిపారు.

‘అన్ని వివరాలు అందుబాటులోనే..’

వింటర్‌ ఒలింపిక్స్‌కు కరోనా వైరసే అతిపెద్ద సవాలు అని నిర్వాహకులు గత నెలలోనూ పేర్కొన్నారు. మరోవైపు.. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు తమవద్ద మార్గాలు ఉన్నాయని దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ విషయంలో చైనా ఇప్పటికే సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసిందని స్థానిక ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌’లోని వైరస్ నియంత్రణ సంస్థ అధిపతి జు వెన్‌బో వెల్లడించారు. డీయాక్టివేటేడ్‌, ప్రొటీన్‌, వెక్టార్‌ ఆధారిత వ్యాక్సిన్‌లపై పరిశోధనల సమాచారంతోసహా అనేక వివరాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రయాణాలపై ఆంక్షలు, లాక్‌డౌన్‌ల ద్వారా ఇతర దేశాలనుంచి వైరస్‌ వ్యాప్తిని దాదాపు కట్టడి చేస్తున్న చైనా అధికారులు.. ప్రస్తుతం స్థానికంగా డెల్టా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని