
Omicron: ఒమిక్రాన్‌తో ఆగమాగం
కట్టడి చర్యలు ముమ్మరం చేసిన దేశాలు
దక్షిణాఫ్రికా కంటే ముందే నెదర్లాండ్స్‌లో వ్యాప్తి!
బ్రసెల్స్, జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి అని, తీవ్ర పరిణామాలకు ఇది దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. సమీప భవిష్యత్తులో మరో బలమైన ఉద్ధృతి రాబోతోందన్న ప్రాథమిక అంచనాలతో ముందస్తు కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి. విదేశీయులు రాకుండా సరిహద్దులను మూసివేసి, విమాన సేవలను నిలిపేస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఈ తరహా కేసులు... రోజుల వ్యవధిలోనే పలు దేశాల్లోనూ నమోదవుతున్నాయి. దీంతో ఈ వేరియంట్ తీవ్రతను అంచనా వేసేందుకు అవసరమైన ఆధారాల కోసం డబ్ల్యూహెచ్‌వో అన్వేషణ సాగిస్తోంది. శక్తిమంతమైన ఈ వేరియంట్‌కు రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందని పేర్కొంది. తీవ్ర పరిస్థితులు తలెత్తకముందే టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఒమిక్రాన్ కారణంగా ఇప్పటివరకూ ఎవరూ మృతిచెందలేదని, ఈ బాధితుల్లో స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, జపాన్ దేశాల్లో మంగళవారం ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి! పోర్చుగల్, స్కాట్లాండ్లో ఇప్పటికే ఈ వేరియంట్ స్థానికంగా వ్యాపించినట్టు నిపుణులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య మంగళవారం 14కు చేరింది. దీంతో బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, సెలూన్లు తదితర దుకాణాలు, ప్రజారవాణా సాధనాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఒమిక్రాన్‌తో తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.
తొలిసారి వెలుగుచూసింది ఎప్పుడు, ఎక్కడ?
కొత్త వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌వోను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలోకి ఒమిక్రాన్ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్ వెల్లడించింది. దీంతో పలు దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘బి.1.1.529’ విషయమై దక్షిణాఫ్రికా ప్రపంచాన్ని అప్రమత్తం చేయడానికి ముందే... నెదర్లాండ్స్‌లో ఈ తరహా కేసులు నమోదైన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి ఒమిక్రాన్‌ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబరు 24న వెల్లడించింది.