Viral news: దేవుడి పాదాలపైనే ప్రాణం విడిచాడు..వీడియో వైరల్‌

మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఓ వ్యక్తి దేవుడి పాదాలకు నమస్కరిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో నమోదయ్యాయి.

Updated : 04 Dec 2022 20:47 IST

కట్నీ: ఎప్పటిలాగే గుడికి వెళ్లాడు. ప్రార్థన అనంతరం దేవుడి పాదాలపై తలపెట్టి అలా ఉండిపోయాడు. మిగతా భక్తులంతా మొక్కుతున్నాడేమో అనుకున్నారు.తీరా చూసేసరికి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటు ఎంత సులువుగా ప్రాణం తీస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

మెహానీ అనే వ్యక్తి మెడికల్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ప్రతి గురువారం దగ్గర్లోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థన చేస్తుంటాడు. ఎప్పటిలాగే గుడికి వెళ్లిన ఆయన.. ప్రార్థన ముగిసిన తర్వాత దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తల పెట్టాడు. దాదాపు 15 నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు. అనుమానం వచ్చిన భక్తులు అతణ్ని పైకిలేపగా.. ఎలాంటి చలనం లేదు. అప్రమత్తమైన దేవాలయ సిబ్బంది.. దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మెహానీ మృతికి సైలెంట్‌ హార్ట్‌ఎటాక్ కారణమై ఉండొచ్చని తెలిపారు.

మరోవైపు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఇలాంటి తరహా ఘటనే గత శుక్రవారం చోటు చేసుకుంది. డ్రైవర్‌కు గుండెపోటు వచ్చి హఠాత్తుగా మరణించడంతో జంక్షన్‌లో నిలిపిన వాహనాలపైకి బస్సు దూసుకుపోయింది. ఈ ఘటనలో మరోవ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పలువురికి గాయాలయ్యాయి. సాధారణంగా  గుండెనొప్పి వచ్చిన వారిలో విపరీతమైన ఛాతీనొప్పి, ఒత్తిడి, ఆకస్మికంగా ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, సైలెంట్ హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారిలో ఇవేవీ కనిపించవని వైద్యనిపుణులు చెబుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని