Dussehra Special: రావణుడిని పూజించే గ్రామం ఎక్కడ ఉందో తెలుసా...!

దేశంలో ఒక్కచోట మాత్రం రావణసంహారం చెయ్యరు అంతేకాదు రావణుడిని పూజిస్తారు. అది ఎక్కడ ఉంది. అసలెందుకు అలా చేస్తున్నారు వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ అర్టికల్‌ చదివేయండి.

Published : 06 Oct 2022 01:56 IST

అకోలా (మహారాష్ట్ర‌): చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశమంతటా ఏటా దసరా పండగ జరుపుకొంటూ ఉంటారు. విజయ దశమి రోజున సాయంత్రం ప్రజలంతా రావణ దహనం చేసి ఆనందిస్తారు. ఇది దేశంలో ఉన్న సంప్రదాయం. కానీ ఒక్కచోట మాత్రం రావణ దహన కార్యక్రమం నిర్వహించరు. అంతేకాదు రావణుడిని దేవుడిగా పూజిస్తారు. ఇంతకీ ఎక్కడ? అక్కడి ప్రజలెందుకు అలా చేస్తారో తెలుసుకోవాలంటే మహారాష్ట్ర వెళ్లాల్సిందే..

మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని సంగోలా గ్రామంలో దసరా రోజు రాక్షస రాజు రావణుడికి ఒక ప్రత్యేకమైన హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. దానిని ‘ఆరతి’ అని పిలుస్తారు. అక్కడ నివసించే వారు రావణుడి ఆశీర్వాదం వల్లే తాము ఉపాధి పొంద గలుగుతున్నామన్నది వాళ్ల విశ్వాసం. ఆయన వల్లనే తమకు జీవనోపాధి కలిగిందని, గ్రామంలో శాంతి, ఆనందానికి కారణం రావణుడేనని వాళ్లు ఏళ్లుగా నమ్ముతారు. అంతేకాదు ఆ గ్రామం మధ్యలో 10 తలల రావణుడి ఎత్తైన రాతి విగ్రహం  కూడా ఉంటుంది. 300 సంవత్సరాల నుంచి దసరా రోజు ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇస్తారు. దానిని చూడడం కోసం దేశ నలుమూలల నుంచి ప్రజలు ఆ గ్రామానికి చేరుకుంటారు. 

ఈ సంప్రదాయంపై అక్కడ స్థానికులు మాట్లాడుతూ..‘‘రావణుడి ఆశీర్వాదంతో ఈ గ్రామంలో చాలా ఉపాధి పొందుతున్నారన్నది మా నమ్మకం. దసరా రోజు మేము రావణుని విగ్రహానికి పూజలు చేస్తాం. కొంతమంది గ్రామస్థులు ఆయన్ని పండితుడిగా భావిస్తారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల మాత్రమే సీతను అపహరించి ఆమె పవిత్రతను కాపాడాడని మేం విశ్వసిస్తాం’’ అని అన్నారు. అక్కడ పూజారి మాట్లాడుతూ..‘‘ రావణుడి తెలివి, ఆయనకు ఉన్న గొప్ప లక్షణాల కారణంగా మేం ఆయన్ని పూజిస్తాం. మా కుటుంబం చాలా కాలంగా రావణుడిని పూజిస్తోంది. ఆ లంకా రాజు వల్లనే గ్రామంలో ఆనందం, శాంతి, సంతృప్తి నెలకొంది’’ అని చెప్పారు. రావణుడితో పాటు రాముడిని కూడా ఆ గ్రామస్థులు పూజిస్తూ ఉండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని