
USA: బలోపేతం అవుతున్న భారత్-అమెరికా రక్షణ సంబంధాలు: కొత్త రాయబారి ఎరిక్ మిషెల్
ఇంటర్నెట్‌డెస్క్: ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతమవుతున్నాయని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన ఎరిక్ మిషెల్ గార్సెట్టి వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక ప్రధాన విజయమని పేర్కొన్నారు. లాస్ ఏంజెల్స్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎరిక్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా బైడెన్ సర్కారు ఎంచుకొంది. బైడెన్ ఆంతరంగికుల్లో ఒకరిగా ఎరిక్‌కు పేరుంది. నేడు ఆయన నియామకానికి సంబంధించిన కన్ఫర్మేషన్ హియరింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన కాట్సా ఆంక్షల విధింపుపై మాట్లాడుతూ ‘‘ఆంక్షల విషయంలో మా సెక్రటరీల నిర్ణయాల్ని ముందుగానే చర్చించాలనుకోవడంలేదు. నేను విదేశీ వ్యవహారాల కమిటీకి సంబంధించి ఛైర్మన్, సభ్యులకు ఒక్కటే చెప్పదలుచుకొన్నా. నా దేశ చట్టాలను గౌరవిస్తా. ఈ విషయం కాట్సా చట్టం, దాని మినహాయింపులకు కూడా వర్తిస్తుంది’’ అని పేర్కొన్నారు.
అమెరికా వ్యవస్థలకు ప్రమాదకరంగా మారే వాటిని మార్చుకోవడాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నట్లు ఎరిక్ మిషెల్ తెలిపారు. ‘‘భారత్-అమెరికా మధ్య గత కొన్నేళ్లలో ఆయుధ వాణిజ్యం 0 నుంచి 20 బిలియన్ డాలర్లకు చేరింది. మా మధ్య నిఘా సమాచార మార్పిడి ఉంది. దీంతోపాటు సంయుక్త యుద్ధ విన్యాసాలు వంటివి జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘ప్రధాన రక్షణ భాగస్వామి’హోదా కేవలం భారత్ ఒక్కదానికే ఇచ్చామని వెల్లడించారు.