Grenade Attack: ఉగ్రవాదుల గ్రెనేడ్‌ దాడి.. అమరుడైన పోలీసు

బందిపొరాలో గ్రెనేడ్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు మరో పోలీసు ప్రాణాలు తీశారు......

Updated : 23 Nov 2022 11:21 IST

శ్రీనగర్‌: ఇటీవల జమ్మూ- కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో కాల్పులు జరిపి ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను బలిగొన్న ఉగ్రవాదులు.. తాజాగా బందిపొరాలో గ్రెనేడ్‌ దాడికి పాల్పడి మరొక పోలీసు ప్రాణాలు తీశారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడి నిషాత్ పార్క్ సమీపంలో స్థానిక పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ సంయుక్త బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో తొలుత అయిదుగురికి గాయాలు కాగా.. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పోలీసు సిబ్బందిలోని జుబైర్ అహ్మద్ మృతి చెందినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మరోవైపు భద్రతాబలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టి, సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతున్నాయి.

జనవరి 29న.. కుల్గాం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గనీపై ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే, గనీ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఓ ఉగ్రవాదిని పోలీసులు గతవారం ఎన్‌కౌంటర్‌ చేశారు. కొన్నాళ్లుగా భద్రతాబలగాలు కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జనవరిలోనే దాదాపు పదికి పైగా ఎన్‌కౌంటర్లు నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని