కొవిడ్‌ విజేతలకు ఒక్క డోసు టీకా చాలు!

కరోనా విజేతలు ఒక్క డోసు కొవిడ్‌ టీకా తీసుకుంటే సరిపోవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Published : 05 Feb 2021 13:17 IST

ప్రాథమికంగా వెల్లడించిన అమెరికా శాస్త్రవేత్తలు

దిల్లీ: కరోనా విజేతలు ఒక్క డోసు కొవిడ్‌ టీకా తీసుకుంటే సరిపోవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వారిలో ఇదివరకే యాంటీబాడీలు వృద్ధి చెందడంతో పాటు... దీనికి సంబంధించిన మెమొరీ వారి రోగనిరోధక వ్యవస్థలో పదిలంగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఐకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా... మహమ్మారి నుంచి కోలుకున్న కొందరికి ఒక్క డోసు చొప్పున మోడెర్నా, మరికొందరికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులపాటు వారి రోగనిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులను నిశితంగా పరిశీలించారు. ఇప్పటివరకూ కరోనా బారిన పడకుండా, టీకా రెండు డోసులు తీసుకున్నవారి కంటే... ఒక్క డోసు తీసుకున్న కొవిడ్‌ విజేతల్లోనే యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి అయినట్టు గుర్తించారు. ‘‘కరోనా విజేతలైన ఆరోగ్య కార్యకర్తలు ఒక్క డోసు టీకా తీసుకున్న ఏడు రోజుల్లోనే వారిలో యాంటీబాడీలు విపరీతంగా పెరిగాయి. 14 రోజుల్లో మరింత వృద్ధి చెందాయి. మహమ్మారి బారిన పడకుండా... సింగిల్‌ డోసు టీకా తీసుకున్నవారిలో ఈ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదు. ఇదంతా ప్రాథమిక సమాచారమే. ఈ విషయమై మరింత లోతైన సమాచారం తెలుసుకోవాల్సి ఉంది’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.
రెండు డోసులే మేలు...
ఈ అధ్యయనంపై ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, అంటువ్యాధుల వైద్య నిపుణుడు ఇలియాన్‌ రీలే స్పందించారు. అధ్యయన ఫలితాల మాట ఎలా ఉన్నా... అందరూ రెండు డోసుల టీకా తీసుకోవడమే ఉత్తమం, సురక్షితమని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
భారత్‌లో క్రియాశీల రేటు..1.40 శాతం

సీరం, యూనిసెఫ్‌ వ్యాక్సిన్‌ ఒప్పందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని