Corona: ఒక్క డోసుతో 50% వ్యాప్తి తగ్గినట్లే!

Corona Vaccine: ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వైరస్‌ సోకే ప్రమాదం 50% తగ్గుతుందట

Updated : 28 Apr 2021 12:41 IST

పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

లండన్‌ : కరోనా వ్యాప్తి విషయంలో ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తలు కీలక విషయం వెలుగులోకి తెచ్చారు. వ్యాక్సిన్‌.. కరోనా వైరస్‌ నుంచి రక్షించడమే కాకుండా వ్యాప్తిని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. 

ఈ మేరకు పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌(పీహెచ్‌ఈ) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత మహమ్మారి బారిన పడిన వారి నుంచి టీకా తీసుకోని కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు గుర్తించారు. దీంతో టీకా వైరస్‌ బారి నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైందని బ్రిటన్‌ హెల్త్‌ సెక్రటరీ మ్యాట్‌ హాన్‌కాక్‌ వెల్లడించారు. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోందన్నారు.

ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనీసం ఒకరు కరోనా బారిన పడిన 24 వేల కుటుంబాల్లో 57 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై ఈ అధ్యయనం జరిపారు. ఈ ఫలితాల్ని పది లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారి సమాచారంతో పోల్చి చూడగా.. తాజా విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఒక డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత వైరస్‌ వల్ల తలెత్తే లక్షణాలు 65 శాతం తగ్గినట్లు తేలిన విషయం తెలిసింది. ఇళ్లు, జైళ్లు, లేదా కలిసి నివాసం ఉండే ప్రదేశాల్లో వైరస్‌ సంక్రమణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు గతంలోనే గుర్తించారు. 

బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ సత్ఫలితాలిస్తున్నట్లు పీహెచ్‌ఈ అధ్యయనంలో తేలింది. మార్చి చివరి నాటికి 60 ఏళ్ల పైబడిన వారిలో 10,400 మరణాలను నియంత్రించగలిగినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని