one nation one election: త్వరలో కేంద్ర క్యాబినెట్‌ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్‌ ముందుకు రానుంది.

Published : 15 Jun 2024 06:17 IST

దిల్లీ: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్‌ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ చేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ నిర్దేశించిన 100 రోజుల ఎజెండాలో భాగంగా సాధ్యమైనంత త్వరగా జమిలి ఎన్నికల కమిటీ నివేదికను మంత్రి మండలి పరిశీలిస్తుందని వెల్లడించాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని రెండు దశల్లో అమలు చేయాలని కమిటీ సూచించింది. తొలుత లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఈ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోగా రెండో దశలో భాగంగా స్థానిక సంస్థలు అన్నింటికీ కలిపి పోలింగ్‌ జరిగేలా చూడాలని ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించిన నివేదికలో కమిటీ పేర్కొంది. రెండు దశల ఎన్నికలకు గాను ఉమ్మడిగానే ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు జాబితాలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. మరోవైపు జమిలి ఎన్నికలపై న్యాయశాఖ కూడా తన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. వీటిని 2029 నుంచి అమలుచేయాలని, ఒకవేళ హంగ్‌ ప్రభుత్వం లేదా అవిశ్వాసం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏకీకృత ప్రభుత్వం కోసం సిఫార్సు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు