One Rupee Doctor: ‘ఒక్క రూపాయి డాక్టర్‌’ సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ ఇక లేరు..

ప్రజలకు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యుడు (One Rupee Doctor) సుశోవన్‌ బందోపాధ్యాయ్‌ (84) ఇకలేరు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన......

Updated : 24 Nov 2022 15:23 IST

ప్రధాని మోదీ, బెంగాల్‌ సీఎం దీదీ సంతాపం

కోల్‌కతా: ప్రజలకు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యుడు (One Rupee Doctor) సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ (84) ఇకలేరు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. దాదాపు 60 ఏళ్ల పాటు బెంగాలీలకు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ (Sushovan Bandyopadhyay)ను అక్కడి ప్రజలు ప్రేమగా ‘ఒక్కరూపాయి డాక్టర్‌’ అని పిలుస్తుంటారు. 1984లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై బోల్పోర్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగానూ సేవలందించారు. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. ఆ పార్టీకీ గుడ్‌బై చెప్పారు. ఈ ప్రజా వైద్యుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 2020లో ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే, అదే ఏడాది అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా ఆయన పేరు గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డుల్లోకెక్కింది.

ప్రధాని మోదీ.. సీఎం దీదీ సంతాపం

సుశోవన్‌ బందోపాధ్యాయ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. డాక్టర్‌ సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ ఎంతో మందికి రోగాలను నయం చేసిన గొప్ప వైద్యుడిగా, విశాల హృదయం కలిగిన వ్యక్తిగా ప్రజలకు గుర్తుండిపోతారని మోదీ పేర్కొన్నారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో ఆయనను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకొంటూ ఆ ఫొటోను ప్రధాని ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ వైద్యుడి మృతి తనను తీవ్రంగా బాధించిందని.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్‌ చేశారు. అలాగే, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రజా వైద్యుడి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మరణం విచారకరమని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని