భారత్..తొలి కొవిడ్‌ మరణానికి ఏడాది!

భారత్‌లో తొలి కరోనా మరణం సంభవించి ఏడాది కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 58వేల మంది కరోనా వల్ల మరణించారు.

Published : 10 Mar 2021 23:17 IST

దిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన విషయం తెలిసిందే. ఇది వెలుగుచూసి ఏడాది దాటినప్పటికీ.. కొన్ని దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి ఇప్పటికీ నియంత్రణలోకి రావడం లేదు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 11కోట్ల మందిలో వైరస్‌ బయటపడగా, వీరిలో 26లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో తొలి కరోనా మరణం సంభవించి ఏడాది కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 58వేల మంది కరోనా వల్ల మరణించారు.

జనవరి 30న తొలి కరోనా కేసు..

భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30, 2020నాడు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వుహాన్‌లో విద్యను అభ్యసిస్తోన్న కేరళకు చెందిన విద్యార్థిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రక్తనమూనాలను సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు జరపగా, ఫలితం పాజిటివ్‌గా తేలింది. దీన్నే దేశంలో తొలి కరోనా వైరస్‌ కేసుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తొలి కరోనా మరణం మార్చిలో..

గతేడాది జనవరిలోనే కరోనా వైరస్‌ వెలుగు చూసినప్పటికీ, కొవిడ్‌ మరణం మాత్రం మార్చి నెలలో నమోదయ్యింది. కర్ణాటకలోని కలబురగికి చెందిన ఓ వృద్ధుడిలో మార్చి 9న కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతడిని తొలుత కలబురగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ రక్తనమూనాలను సేకరించి బెంగళూరులోని ల్యాబ్‌కు పంపించారు. ఈ సమయంలోనే వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం అదేరోజు తిరిగి కలబురగిలోని తన సొంత గ్రామానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే (మార్చి 10వ తేదీన) ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల తర్వాత వైద్య పరీక్షల్లో అతనికి కొవిడ్‌-19 ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన కేంద్ర ప్రభుత్వం, దేశంలో తొలి కరోనా మరణంగా మార్చి 12న అధికారికంగా ప్రకటించింది. అయితే, కొవిడ్‌తో మరణించిన వ్యక్తి అంతకుముందు సౌదీ అరేబియా నుంచి భారత్‌కు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా అప్పటినుంచి గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించిన వైరస్‌,  కోటీ 11లక్షల మందిలో బయటపడింది. వైరస్‌ సోకినవారిలో లక్షా 58వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది.

జనవరి 16న వ్యాక్సినేషన్‌..

ప్రపంచంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, కరోనా కేసుల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. కొవిడ్‌ మరణాల్లో ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు ఇక్కడ తక్కువగానే ఉంది. ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. దీంతో సాధ్యమైనంత వరకు వైరస్‌ వ్యాప్తిని అట్టుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనవరి 16, 2021న దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 2కోట్ల 43లక్షల కొవిడ్‌ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని