Omicron: ఏడాదిన్నర చిన్నారి.. ఒమిక్రాన్‌ నుంచి కోలుకుంది!

ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ ఉపశమనం కలిగించే వార్త! మహారాష్ట్రలో ఇటీవల ఒమిక్రాన్‌ బారిన పడిన ఏడాదిన్నర చిన్నారి కోలుకుంది. చిన్నారికి తాజాగా నిర్వహించిన ........

Published : 11 Dec 2021 19:03 IST

మరో మూడేళ్ల బాలుడిలోనూ లక్షణాల్లేవన్న వైద్యులు

పుణె: ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ ఉపశమనం కలిగించే వార్త! మహారాష్ట్రలో ఇటీవల ఒమిక్రాన్‌ బారిన పడిన ఏడాదిన్నర చిన్నారి కోలుకుంది. చిన్నారికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేసినట్టు పుణె జిల్లా పింప్రీ-చించ్వాడ్‌ ప్రాంత ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇదే ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడిలోనూ ఈ కొత్త వేరియంట్‌ లక్షణాల్లేవని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. పింప్రీ చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో తాజాగా ఒమిక్రాన్‌ సోకిన నలుగురిలో మూడేళ్ల బాలుడు ఒకరు కాగా.. మిగతా ముగ్గురిలో ఇద్దరు పురుషులు.. ఒకరు మహిళ ఉన్నారు. అయితే, ఈ నలుగురూ నైజీరియా నుంచి తన ఇద్దరు కూతుళ్లతో వచ్చిన మహిళతో కాంటాక్టు అయినవారే కావడం గమనార్హం.

కొద్దిరోజుల ముందు నైజీరియా నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ పింప్రీ చించ్వాడ్‌లోని తన సోదరుడి వద్దకు వచ్చి కలిసింది. అయితే, ఆ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు ఆమె సోదరుడు, అతని ఇద్దరు కుమార్తెలకు (ఏడాదిన్నర చిన్నారి) ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలినట్టు వైద్యులు వివరించారు. ఈ ఆరుగురిలో ఒకటిన్నర ఏడాది వయసున్న చిన్నారితో పాటు నలుగురికి నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. పొడి దగ్గు ఉన్న ఒక మహిళ మినహా మిగతా వారిలో ఎలాంటి లక్షణాలూ లేవని, అందరూ సురక్షితంగానే ఉన్నట్టు వివరించారు. అలాగే, పొడి దగ్గు ఉన్నప్పటికీ ఆ మహిళకు కూడా ఒమిక్రాన్‌ నెగెటివ్‌గానే నిర్ధారణ కావడంతో ఆమెనూ డిశ్చార్జి చేశామన్నారు. మరో ఇద్దరు మహిళలకు మాత్రం రిపీట్‌ టెస్ట్‌లోనూ ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలడంతో వారిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని వివరించారు. 

మరోవైపు, ఇదే ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడిలోనూ ఎలాంటి లక్షణాల్లేవన్నారు. పిల్లల సంరక్షణ వార్డులో ఉంచామని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారు. మిగతా ముగ్గురిలోనూ లక్షణాల్లేవన్నారు. వీరి గురించి ఎలాంటి ఆందోళన అవసరంలేదని వెల్లడించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని