ONGC Helicopter: సముద్రంలో పడిపోయిన హెలికాప్టర్‌.. నలుగురి మృతి

ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC)కి చెందిన హెలికాప్టర్‌ అరేబియా సముద్రంపై ల్యాండింగ్‌ అవుతోన్న సమయంలో ప్రమాదానికి గురయ్యింది.

Published : 28 Jun 2022 18:54 IST

ముంబయి: ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC)కి చెందిన హెలికాప్టర్‌ అరేబియా సముద్రంపై ల్యాండింగ్‌ అవుతోన్న సమయంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు ఓఎన్‌జీసీ ఉద్యోగులే. మరో ఐదుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ (Rescue Operation) చేపట్టి అందరినీ బయటకు తీసుకువచ్చినప్పటికీ.. అందులో నలుగురు చనిపోయినట్లు తెలిపారు.

ఓఎన్‌జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, ఒక కాంట్రాక్టర్‌, ఇద్దరు పైలట్లతో వెళ్తోన్న పవన్‌హన్స్‌ సంస్థకు చెందిన హెలికాప్టర్‌ (Helicopter) అరేబియా సముద్రంలోని ఓ రిగ్‌కు సమీపంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు హెలికాప్టర్‌ నీటిపై పడిపోయింది. అయితే దానికి ఉన్న ఫ్లోటర్ల సాయంతో నీటిపై తేలగలిగింది. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ, భారత తీర దళం బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి తొమ్మిది మందిని బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో నలుగురు స్పృహతప్పి ఉన్నట్లు గుర్తించారు. బాధితులందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇదిలాఉంటే, అరేబియా సముద్రంలో ఉన్న నిల్వల నుంచి చమురు, గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఓఎన్‌జీసీ ఈ సముద్రంలోనే అనేక రిగ్‌లు, స్థావరాలను ఏర్పాటు చేసింది. అక్కడకు సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా పవన్‌హన్స్‌కు చెందిన సికోర్‌స్కై ఎస్‌-76 హెలికాప్టర్‌ను ఓఎన్‌జీసీ లీజుకు తీసుకుంది. ఓ రిగ్‌కు సమీపంలో ఈ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురయ్యింది. అయితే, హెలికాప్టర్‌ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్‌ అవ్వాల్సి వచ్చిందన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని