PM CARES Fund: పీఎం సహాయ నిధికి మరో రూ.100 కోట్లు

పీఎం కేర్స్‌ (PM CARES)కి ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ (ONGC) రూ.100 కోట్ల విరాళం అందించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి (Hardeep Singh Puri)తన ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Published : 01 Apr 2023 22:59 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ (ONGC) పీఎం సహాయ (PM CARES) నిధికి మరో సారి విరాళం అందించింది. ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయంగా శుక్రవారం రూ. 100 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని భారత్‌ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి (Hardeep Singh Puri) తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఓఎన్‌జీసీ సంస్థ నుంచి విరాళాలు రావటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

‘‘ఆరోగ్య రక్షణ కోసం అందించే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వాటిని విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉంది.  దీనికి అవసరమైన వనరులను  సమకూర్చేందుకు ఈ ఫండ్ సహాయపడుతుంది’’ అని ఓఎన్‌జీసీ పేర్కొంది. అంతేకాకుండా కొవిడ్‌ మహమ్మారి, H3N2 ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరస్‌తో  పోరాడేందుకు అవసరమైన ఔషధాల తయారీకి సహాయ పడుతుందని వెల్లడించింది.  క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతుగా నిలిచేందుకు ఓఎన్‌జీసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ విరాళం కూడా ఒక భాగమని తెలిపింది.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం సహాయ (PM CARES) నిధి పేరుతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసింది. దీంతో పీఎం నిధికి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని పీఎం కేర్స్‌కి అందించారు. 2020 ఏప్రిల్‌ కరోనా తొలిదశ వ్యాప్తి సమయంలో  ఓఎన్‌జీసీ రూ.300 కోట్ల సహాయాన్ని అందించగా..  వైద్య పరికారాలకోసం 2021-22 లో మరోసారి రూ.70 కోట్ల విరాళం అందించింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని