శబరిమలకు ఎక్కువ మందిని అనుమతించలేం

కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భక్తుల రాకపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రస్తుతం రోజుకు 5వేల మందిని అనుమతిస్తున్నామని, అంతకంటే ఎక్కువ

Published : 10 Feb 2021 14:34 IST

దేవస్థానం బోర్డు విజ్ఞప్తిని తిరస్కరించిన కేరళ ప్రభుత్వం 

తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భక్తుల రాకపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రస్తుతం రోజుకు 5వేల మందిని అనుమతిస్తున్నామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించలేమని స్పష్టం చేసింది. 

కుంభ మాస పూజ నిమిత్తం శబరిమలకు రోజువారీ యాత్రికుల సంఖ్య పెంచాలని, రోజుకు 15వేల మంది భక్తులను అనుమతించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి దృష్ట్యా దేవస్థానం అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని దేవాదాయ శాఖమంత్రి రాష్ట్ర ఆరోగ్యశాఖను కోరారు. దీనిపై మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. కరోనా తీవ్రత దృష్ట్యా భక్తుల రాకపై పరిమితులు విధించాల్సి వచ్చిందని, ఇప్పటికే రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అంతకంటే మించి పెంచలేమని వెల్లడించింది. 

కరోనా విజృంభణ నేపథ్యంలో గతంలో శబరిమలకు నిత్యం 2వేల మందిని, శని, ఆదివారాల్లో 3వేలమంది భక్తులను అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రోజువారీ భక్తుల సంఖ్యను 5వేలకు పెంచుతూ గతేడాది డిసెంబరులో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. శబరిమల వెళ్లే యాత్రికులకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

ఏడాదంతా శరణం అయ్యప్పా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని