carpooling : కార్‌పూలింగ్‌పై నిషేధం వైట్‌ నంబర్‌ ప్లేట్‌ వాహనాలకు మాత్రమే: కర్ణాటక రవాణాశాఖ మంత్రి

వైట్‌ నంబర్‌ ప్లేట్ కలిగిన ప్రైవేటు వాహనాలకు మాత్రమే కార్‌పూలింగ్‌ (carpooling) నిబంధన వర్తిస్తుందని కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి (Ramalinga Reddy) అన్నారు.

Updated : 02 Oct 2023 22:19 IST

బెంగళూరు: కార్‌పూలింగ్‌పై (carpooling) నిషేధం విధిస్తున్నట్లు ఇటీవల కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ప్రకటించడంతో పలువురు వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే రూ.10వేల జరిమానా, ఆరు నెలల వరకూ ఆర్సీ రద్దు అవుతుందని పేర్కొనడంతో బెంగళూరులోని ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి (Ramalinga Reddy) కార్‌పూలింగ్‌పై స్పష్టత నిచ్చారు. వైట్‌ నంబర్‌ ప్లేట్ కలిగిన ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుందని చెప్పారు. 

ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్‌ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

‘కార్‌ పూలింగ్‌తో మాకు ఎలాంటి సమస్య లేదు. అయితే వైట్ బోర్డు వాహనాలను అందుకోసం వినియోగించకూడదని’ అన్నారు. ఇదే అంశంపై మరింత లోతుగా చర్చించడానికి మంగళవారం ట్రాన్స్‌పోర్టు సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్‌ పూలింగ్‌ను శాశ్వతంగా నిషేధించే ఆలోచనలో ఉన్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. ఈ కేసులపై జరిమానా కూడా విధించడంలేదని, రెండు కేసుల్లో ఒకదానికి మాత్రమే అపరాధ రుసుము విధించామని చెప్పారు. 

ఎల్లో నంబర్‌ ప్లేట్‌ కలిగిన వాహనాలు నిరభ్యంతరంగా కార్‌పూలింగ్‌ చేసుకోవచ్చని రవాణా శాఖ సైతం పేర్కొంది. రోడ్డు రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కార్‌పూలింగ్‌పై నిషేధం ప్రకటన వెలువడగానే బెంగళూరు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పర్యావరణ హితం, ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం చాలా రాష్ట్రాలు తమ ప్రధాన నగరాల్లో కార్‌పూలింగ్‌ విధానాన్ని పాటించమని ఉద్యోగులను కోరుతున్నాయి. 

కార్‌పూలింగ్‌ అంటే అదే మార్గంలో లేదా ఒకటే కార్యాలయానికి వెళ్లాల్సిన ఉద్యోగులు ఒకే వాహనంలో కలిసి ప్రయాణిస్తూ వెళ్లడం. దాంతో వారికి రవాణా భారం తగ్గుతుంది. సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చు. అసలే బెంగళూరులో కొన్ని రోజులుగా ట్రాఫిక్‌ చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి సమయంలో కార్‌పూలింగ్‌ను నిషేధిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ విధానంలో ఇన్నాళ్లుగా ప్రయాణిస్తున్న ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. రవాణాశాఖ మంత్రి తాజాగా వైట్‌ నంబర్‌ ప్లేట్‌కు మాత్రమే నిషేధం అని చెప్పినప్పటికీ ఆ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించేలా కన్పించడం లేదు. ఎందుకంటే కార్‌పూలింగ్‌లో మెజారిటీ వాటా వైట్ నంబర్‌ ప్లేట్‌ వాహనాలదే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని