జనవరి 1 నుంచి వ్యాక్సిన్‌ రెండో డోసు తప్పనిసరి!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం,  ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ హరియాణా ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ పెంచడంపై దృష్టిసారించింది. కొత్త వేరియంట్‌ వ్యాప్తిని......

Published : 22 Dec 2021 23:37 IST

చండీగఢ్‌: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం, ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ హరియాణా ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ పెంచడంపై దృష్టిసారించింది. కొత్త వేరియంట్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 2022 జనవరి 1 నుంచి వ్యాక్సిన్‌ రెండో డోసుని తప్పనిసరి చేసింది. టీకా పూర్తయిన వారిని మాత్రమే మాల్స్‌, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ధాన్యపు మార్కెట్లకు అనుమతించనున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వెల్లడించారు. టీకా వేసుకోకపోతే అధికారులతో పాటు మిగతా వారిని కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అనుమతించబోమని స్పష్టంచేశారు. కొవిడ్‌ నుంచి టీకాలే రక్షణ కల్పిస్తుండటం, రాష్ట్రంలో ఇంకా సెకండ్‌ డోసు వేసుకోవాల్సిన వారు అనేకమంది ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిల్‌ విజ్‌ తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరంజీవిరావు ఒమిక్రాన్‌ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు అనిల్‌ విజ్‌ స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకపోతే ₹500 జరిమానా విధించాలని ఎస్పీలు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. అనంతరం ఆరోగ్యశాఖ అధికారులు 2022 జనవరి 1 నుంచి అమలుచేయనున్న కొవిడ్‌ మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 93శాతం మంది తొలి డోసు తీసుకోగా.. సెకండ్‌ డోసు కేవలం 60 శాతం మందికే పూర్తయిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

రెండో డోసు పూర్తయిన వారిని మాత్రమే సబ్జీ మండీలు, డిపార్టుమెంటల్‌ స్టోర్లు, మద్యం దుకాణాలు, స్థానిక మార్కెట్లు, హోటళ్లు ఇతర ప్రదేశాలకు అనుమతిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. పూర్తిగా వ్యాక్సినేషన్‌ వేసుకున్నోళ్లనే బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లతో పాటు ప్రార్థనా మందిరాలు, పెట్రోల్‌ బంక్‌లు, ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ కేంద్రాలు, షుగర్‌ ఫ్యాక్టరీలు, మిల్క్‌ బూత్‌లు, రేషన్‌ దుకాణాలకు అనుమతించనున్నట్టు తెలిపింది. టీకా పూర్తికాకపోతే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లోకి కూడా అనుమతి ఉండబోదని స్పష్టంచేసింది. పార్కులు, యోగా కేంద్రాలు, జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లకు వెళ్లాలన్నా రెండో డోసు పూర్తికావాల్సిందేనని తెలిపింది. రెండో డోసు పూర్తయిన ప్రయాణికులను మాత్రమే ట్రక్కులు, ఆటోరిక్షా యూనియన్లు అనుమతించాలని సూచించింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని