Noida twin towers: ఇక మమ్మల్ని ఆపాలంటే ఆ దేవుడే దిగిరావాలి!

యూపీలోని నోయిడా(Noida)లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ (Noida twin towers) కూల్చివేతకు సర్వం సిద్ధమైంది.....

Updated : 25 Aug 2022 18:40 IST

నోయిడా: యూపీలోని నోయిడా(Noida)లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ (Noida twin towers) కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. ఈ భవంతులను ఆగస్టు 28న కూల్చివేయాలని సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించడంతో అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం  2.30గంటలకు ఈ బహుళ అంతస్తుల భవనాలు సెకన్లలోనే పేకమేడల్లా కూలిపోనున్నాయి. అయితే, ఇప్పటికే పలుమార్లు ఈ జంట టవర్లు కూల్చివేత వాయిదా పడిన నేపథ్యంలో భవనాలను నేలమట్టం చేసే బాధ్యతను తీసుకున్న ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ మయూర్‌ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో ప్రతిష్ఠాత్మక కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తుగా సూపర్‌ టెక్‌ సంస్థ నిర్మించిన ఈ జంట భవనాల కూల్చివేతకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయన్నారు. తమను ఆపాలంటే ఆ భగవంతుడే దిగిరావాలని వ్యాఖ్యానించారు. అన్ని అంతస్తుల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్టు తెలిపారు. ప్రతి ఫ్లోర్‌లో ఎక్స్‌ప్లోజివ్స్‌ని వైర్‌కు కనెక్టు చేశామని.. 100 మీటర్ల దూరంలో ఉన్న బటన్‌ను నొక్కడం ద్వారా ఈ టవర్లను నేలమట్టం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

అయితే, భవనాల కూల్చివేత తర్వాత 12 నుంచి 15 నిమిషాల పాటు దుమ్ము ఉంటుందని, శిథిలాలు సమీపంలోని నివాస భవనాలపైకి పడవన్నారు. ఒకవేళ శిథిలాలు చెల్లాచెదురుగా పడినా తాము ఆయా నివాస భవనాలను ప్రత్యేకమైన క్లాత్‌తో కవర్‌ చేస్తామని చెప్పారు. ఇంకోవైపు, కూల్చివేత పనులను పరిశీలించేందుకు నోయిడా అథారిటీ సీఈవో, నోయిడా పోలీస్‌ కమిషనర్‌ ఈ రోజు అక్కడికి వెళ్లారు.

ఏం జరుగుతుందో.. ఏమో!

నోయిడాలో ట్విన్‌ టవర్స్‌  కూల్చివేతకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న వేళ.. స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ జంట భవనాలను ఆనుకొని ఉన్న రెండు హౌసింగ్‌ సొసైటీ (ఎమరాల్డ్‌ కోర్టు, ఏటీఎస్‌ విలేజ్‌) నివాసుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ‘‘అవును.. భయంగా ఉంది. అయితే సుదీర్ఘ న్యాయ పోరాటానికి ఫలితం లభించిందన్న ఆనందమూ ఉంది’’ అని రాజేశ్‌ అనే వ్యక్తి తెలిపారు. ఈ రెండు సొసైటీల్లో దాదాపు 5వేల మంది నివసిస్తున్నారు. ‘‘కేరళలో తప్ప మన దేశంలో ఇలాంటి ఎత్తైన భవనాన్ని కూల్చివేసిన దాఖలాలు లేవు. ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్న భయం ఇక్కడ నివాసుల్లో ఉంది’’ అని ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు.  ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ జంట భవనాలను నియంత్రిత ఇంప్లోజివ్‌ టెక్నిక్‌తో ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ కూల్చనున్న సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని