Republic Day: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తొలిసారి ఆర్మీ మేడిన్‌ ఇండియా ఆయుధాలు..!

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఆత్మనిర్భర్‌ భారత్‌ శక్తిని ప్రపంచానికి తెలియజేయనుంది. దీనికి తగినట్లే పరేడ్‌ను సిద్ధం చేస్తున్నారు. 

Updated : 24 Jan 2024 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి రిపబ్లిక్‌ డే(Republic Day) పరేడ్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే దిల్లీలో పరేడ్‌కు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ పరేడ్‌కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి ముఖ్య అతిథిగా రానున్నారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌కు సంబంధించిన టికెట్లను కూడా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. కేవలం భారత్‌లో తయారు చేసిన ఆయుధాలను మాత్రమే ఆర్మీ దీనిలో ప్రదర్శించనుంది. ఈ పరేడ్‌కు సంబంధించిన వివరాలను దిల్లీ ఏరియా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మేజర్‌ జనరల్‌ భవినీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఉదయం 10.30కు ఈ పరేడ్‌(Republic Day) విజయ్‌ చౌక్‌ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగుతుంది. ఈ ఏడాది కర్తవ్యపథ్‌(గతంలో రాజ్‌పథ్‌గా పిలిచే మార్గం)లో రిపబ్లిక్‌ డే కార్యాక్రమంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఆయుధాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఆయుధాలు కాకుండా.. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం దీనిలో పాల్గొంటాయి. 

* సంప్రదాయ 21 గన్‌ సెల్యూట్‌కు ఉపయోగించే పురాతన బ్రిటిష్‌ పౌండర్‌ గన్స్‌ను 105ఎంఎం ఇండియన్‌ ఫీల్డ్‌ గన్స్‌తో భర్తీ చేయనున్నారు. 

* ఈజిప్ట్‌ నుంచి వచ్చిన ప్రత్యేక సైనిక పటాలం కూడా ఈ పరేడ్‌లో పాల్గొననుంది. దీనిలో 120 ఈజిప్ట్‌ సైనికులు ఉంటారు. వీరు ఇప్పటికే దిల్లీ చేరుకొని సాధన చేస్తున్నారు.

* కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు ఈ పరేడ్‌లో భాగస్వాములు కానున్నారు. 

* ఆర్మీ సిగ్నల్‌ కోర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌, ఆర్మీ డేర్‌ డెవిల్స్‌ విభాగాల నుంచి మహిళా అధికారులు మార్చ్‌లో పాల్గొంటారు. ఆకాశ్‌ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్‌ చేతన శర్మ నేతృత్వం వహించనున్నారు.

* బీఎస్‌ఎఫ్‌ క్యామెల్‌ కంటెజెంట్‌లోని మహిళా సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.

* ‘నారీశక్తి’ ప్రదర్శనలో భాగంగా నేవీలో 144 సెయిలర్స్‌ బృందానికి మహిళా అధికారిణులు నేతృత్వం వహించనున్నారు. 

* ఈ పరేడ్‌(Republic Day) కోసం నేవీకి చెందిన ఐఎల్‌-38 విమానం చివరిసారిగా గాల్లోకి ఎగరనుంది. ఈ విమానం 42 ఏళ్లుగా నౌకాదళానికి సేవలు అందించింది.

* రిపబ్లిక్‌ డే ఫ్లైపాస్ట్‌లో మొత్తం 44 విమానాలు  పాల్గొననున్నాయి.  వీటిల్లో తొమ్మిది రఫేల్‌ జెట్‌ విమానాలు కూడా ఉండనున్నాయి. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్‌ హెలికాప్టర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని