Congress: మోదీకి ఒకటే విజ్ఞప్తి.. రూపాయి పతనం సెంచరీ కొట్టకుండా ఆపండి..!

రూపాయి పతనాన్ని సెంచరీ చేయకుండా (రూ.100కు పడిపోకుండా) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపాలంటూ కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది.

Published : 28 Sep 2022 01:27 IST

రూపాయి పతనంపై మండిపడ్డ కాంగ్రెస్‌

దిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయిలో పడిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీని విలువ రికార్డు స్థాయిలో రూ.81 దాటి జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో డాలర్‌తో రూపాయి విలువ పతనాన్ని సెంచరీ చేయకుండా (రూ.100కు పడిపోకుండా) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆపాలంటూ కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది.

‘మోదీజీ ఆశీస్సులతో రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత బలహీన స్థాయికి చేరుకుంది. రూపాయి పతనం, ప్రధానమంత్రిపై విశ్వాసానికి మధ్య సంబంధముందంటూ అధికారంలోకి రాకముందు ఆయనే చెప్పిన విషయాన్ని తెలుసుకోవాలి. గతేడాది సెప్టెంబర్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.73గా ఉండగా.. ప్రస్తుతం అది రూ.81.63లకు చేరుకుంది. అంటే ప్రధానమంత్రి కీర్తి 12 నెలల్లో 12శాతం తగ్గినట్లు’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్‌ విమర్శించారు.  దేశ చరిత్రలో రూపాయి మారకపు విలువ రూ.82ను తాకుతోందని మండిపడిన ఆమె.. అది సెంచరీని తాకకుండా ఆపాలన్నారు.

మోదీ ప్రభుత్వ విధానాల వైఫల్యం వల్లే పెట్టుబడి దారుల్లో విశ్వాసం సన్నగిల్లిపోయిందని సుప్రియా శ్రీనాథ్‌ ధ్వజమెత్తారు. ఇలాంటి సమయంలో వాస్తవ సమస్యలపై మాట్లాడకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు