Published : 12 Jun 2022 21:12 IST

Operation Bulldozer: యూపీలో హింస.. నిందితుల ఇళ్ల కూల్చివేత

రెండోరోజూ బుల్డోజర్‌ ఆపరేషన్‌ కొనసాగించిన యోగి ప్రభుత్వం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల చెలరేగిన అల్లర్లకు కారణంగా భావిస్తున్న నిందితుల ఇళ్లపై యోగి ప్రభుత్వం బుల్డోజర్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా సహ్రాన్‌పూర్‌ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఇళ్లను ఇప్పటికే కూల్చివేయగా.. ఆదివారం నాడు ప్రయాగ్‌రాజ్‌లో మరో నిందితుడి ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ఇతడే మాస్టర్‌మైండ్‌గా పోలీసులు భావిస్తున్నారు. అయితే, అక్రమ నిర్మాణం కావడం వల్లే ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఆ ఇంటిని కూల్చివేసినట్లు యూపీ మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం జరిగిన హింసకు స్థానిక నేత మహమ్మద్‌ జావేద్‌ మాస్టర్‌మైండ్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రంగంలోని దిగిన అధికారులు ఆయన ఇల్లు అక్రమంగా నిర్మించారంటూ శనివారం సాయంత్రం నోటీసులు అంటించారు. ఇదే విషయమై అంతకు చాలారోజుల ముందే నోటీసులు జారీ చేసినప్పటికీ మహమ్మద్‌ జావేద్‌ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అధికారులు పేర్కొన్నారు. అందుకే జూన్‌ 12వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇంటిని ఖాళీ చేయాలని సూచించినప్పటికీ అక్కడ నుంచి సమాధానం లేకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం కూల్చివేతకు ఉపక్రమించారు. ముందుజాగ్రత్త చర్యగా స్థానికంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలు చోట్ల హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఇవి ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు విస్తరించాయి. అయితే, ప్రయాగ్‌రాజ్‌ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు మూడు వందల మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోనూ నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని