Operation Chakra-2: సైబర్‌ నేరగాళ్లే లక్ష్యంగా.. 76చోట్ల సీబీఐ సోదాలు

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారే లక్ష్యంగా రంగంలోకి దిగిన సీబీఐ.. ఆపరేషన్‌ చక్ర-2 (Operation Chankra-2) పేరుతో దేశవ్యాప్తంగా 76 చోట్ల సోదాలు నిర్వహించింది.

Updated : 19 Oct 2023 18:19 IST

దిల్లీ: ఆర్థిక నేరాలకు (Cyber criminals) పాల్పడుతున్న వారే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఆపరేషన్‌ చక్ర-2 (Operation Chankra-2) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 76 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక మోసాలకు సంబంధించి ఐదు వేర్వేరు కేసులు నమోదు చేసిన సీబీఐ ఈ దాడులకు ఉపక్రమించింది.

క్రిప్టోకరెన్సీ మోసానికి పాల్పడుతూ దాదాపు రూ.100 కోట్లను దండుకున్న రాకెట్‌కు సంబంధించి సీబీఐ ఇటీవల ఓ కేసు నమోదు చేసింది. ఫైనాన్షియల్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ (FIU) అందించిన సమాచారంతో ఈ కేసు నమోదైంది. కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకొని సాంకేతిక సహాయ సిబ్బందిగా వ్యవహరిస్తూ విదేశీయులే లక్ష్యంగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది.

ఇజ్రాయెల్‌ పోలీసులకు యూనిఫామ్‌లు.. కేరళ నుంచే..!

ఎఫ్‌ఐయూ, ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌తోపాటు ఇతర అంతర్జాతీయ విభాగాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్‌ చక్ర-2 చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, దిల్లీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో దాడులు జరిపినట్లు పేర్కొన్నాయి. తాజా సోదాల్లో తొమ్మిది కాల్‌ సెంటర్లలో సోదాలు జరిపినట్లు తెలిపింది. ఆపరేషన్‌ కొనసాగుతున్నందున.. మరో రెండు కేసులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం తెలియజేయలేదు. ఇదిలాఉంటే, సైబర్‌ నేరస్థులే లక్ష్యంగా గతేడాది ‘ఆపరేషన్‌ చక్ర’ పేరిట సీబీఐ దేశవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో కేవలం రాజస్థాన్‌లోనే రూ.కోటిన్నర నగదు, అరకేజీ బంగారం స్వాధీనం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని