Israel: ఇజ్రాయెల్‌ మెరుపుదాడి వెనుక బుర్ర..

వందల కొద్ది రాకెట్లు దూసుకొస్తున్నా.. ఒక్కో దాన్ని గురిపెట్టి మరీ కూల్చిన ఇజ్రాయెల్‌కు చెందిన ఐరెన్‌ డోమ్‌ సత్తాను అమెరికాతో సహా పలు దేశాలు ఆసక్తిగా గమనించాయి. అదే సమయంలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ నిర్వహించిన

Published : 31 May 2021 13:23 IST

 ఆపరేషన్‌ ‘గార్డియన్‌ ఆఫ్‌ దివాల్స్‌’లో కృత్రిమ మేధ వినియోగం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వందల కొద్ది రాకెట్లు దూసుకొస్తున్నా.. ఒక్కో దాన్ని గురిపెట్టి మరీ కూల్చిన ఇజ్రాయెల్‌కు చెందిన ఐరెన్‌ డోమ్‌ సత్తాను అమెరికాతో సహా పలు దేశాలు ఆసక్తిగా గమనించాయి. అదే సమయంలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ నిర్వహించిన  ‘ఆపరేషన్‌ గార్డియన్‌ ఆఫ్‌ ది వాల్స్‌’ యుద్ధతంత్ర చరిత్రలోనే పెద్ద ముందడుగు. ఈ  యుద్ధంలో ఇజ్రాయెల్‌ పూర్తిగా కృత్రిమ మేధపై ఆధారపడింది. లక్ష్యాలను గుర్తించడం.. గురిపెట్టడం..  వంటి కీలక కార్యక్రమాలు మొత్తం  ప్రత్యేక అల్గారిథమ్స్‌.. కంప్యూటర్లే చేశాయి. చివరికి హమాస్‌ అదృశ్య టన్నెల్‌ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా వీటి పాత్ర చాలా ఉంది. ఒక రకంగా మిషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లే ఈ యుద్ధాన్ని శాసించాయి. ప్రపంచంలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వాడిన తొలి యుద్ధం ఇదే. 

డేటానే మందుగుండుగా వాడి..

హమాస్‌ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్‌ ఎప్పుడో గ్రహించింది. దీంతో కొన్నేళ్ల ముందు నుంచే రహస్యంగా శత్రువు ఊహకందని రీతిలో సిద్ధమైపోయింది. ఆ దేశానికి ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ‘8200’ ‘అల్కమిస్ట్‌’,‘గాస్పెల్‌’,‘డెప్త్‌ ఆఫ్‌ విజ్‌డమ్‌’ అనే 
 ప్రత్యేకమైన అల్గారిథమ్స్‌, కోడింగ్‌లను తయారు చేసింది. వీటికి ప్రత్యర్థులు వాడే ఎలక్ట్రానిక్‌ పరికరాల సిగ్నల్స్‌, విజువల్‌ ఇంటెలిజెన్స్‌, గూఢచారులు సమీకరించిన సమాచారం (హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌), జియోగ్రాఫికల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి డేటాను సమీకరించారు. వీటిని విశ్లేషించి.. లక్ష్యాలను గుర్తించారు. డివిజెన్‌ ఆఫ్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌లో ఉన్న  ‘గాస్పెల్‌’ అనే అల్గారిథం ఈ డేటాను విశ్లేషించి నమ్మకమైన లక్ష్యాలను గుర్తిస్తుంది. వాటిని ఇజ్రాయెల్‌ వాయుసేనకు అందిస్తుంది. 

ఈ క్రమంలో ఒక మల్టీ డిసిప్లైనరీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది గాజాలోని వందల కొద్దీ లక్ష్యాలను గుర్తించి ఇజ్రాయెల్‌ దళాలకు ఇచ్చింది. దీంతో కచ్చితమైన లక్ష్యాలపై తగినంత బలంతో దాడిచేసే అవకాశం కల్పించింది. వీటిల్లో హమాస్‌ రాకెట్‌ లాంఛర్లను భద్రపర్చిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా లక్ష్యాలను వెతుక్కుంటూ సుదీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం రాలేదు. హమాస్‌, పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ స్థావరాలు, రాకెట్‌ లాంఛర్లు, రాకెట్‌ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, వారి మిలటరీ ఇంటెజెన్స్‌ ఆఫీస్‌లు, డ్రోన్లు, కమాండర్ల ఇళ్లు, హమాస్‌ నేవల్‌ కమాండో యూనిట్లు ఈ దాడుల్లో ధ్వంసమైపోయాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ గ్యాస్‌ క్షేత్రాలకు ముప్పు కల్గించే హమాస్‌ డ్రోన్‌ జలాంతర్గాములను భారీగా ధ్వంసం చేసింది.  

రాకెట్‌ లాంఛర్లను గుర్తించింది ఇలా..

ఇజ్రాయెల్‌ దళాల్లో యూనిట్‌ ‘9900’కు ప్రత్యేక స్థానం ఉంది. వీరు జియోగ్రాఫీ ఇంటెలిజెన్స్‌ను సేకరిస్తారు. ఉపగ్రహాల నుంచి వచ్చిన చిత్రాలను విశ్లేషించి.. ఆ ప్రదేశంలో జరిగిన మార్పులను (కట్టడాలు, వాహనాల కదలికలు, నిర్మాణాలు) గుర్తించి దళాలకు ఇస్తారు. దీంతో హమాస్‌ మోహరించిన రాకెట్‌ లాంఛర్లను ఇట్టే పసిగట్టింది. ఒక పాఠశాల పక్కనే ఉంచిన 14 రాకెట్‌ లాంఛర్లను ఈ దళం గుర్తించింది.  

నాయకులపై గురి..

ఈ సారి చేసిన దాడుల్లో ఇజ్రయెల్‌ హమాస్‌ నాయకత్వంపై గురిపెట్టింది. ఈ దాడుల్లో మొత్తం 150 మంది హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ ఆఫ్‌ పాలస్తీనా సంస్థల సభ్యులు మరణించారు. వీరిలో అత్యధిక మంది భర్తీ చేయడానికి సాధ్యంకాని నాయకులు ఉన్నారు. ఒక దాడిలో బసీమ్‌ ఇసాను ఇజ్రాయెల్‌ దళాలు చంపాయి. అతను ఒక భవనం కింద ఉన్న సొరంగంలో ఉన్నాడు. దీని చుట్టూ ఆరు పాఠశాల భవనాలు ఉన్నాయి. కానీ, ఒక్క పౌరుడు కూడా మరణించకుండా ఐడీఎఫ్‌ ఆ భవనంపై దాడి చేసింది. అతడు గాజాసిటీ బ్రిగేడ్‌ కమాండర్‌.  2014 తర్వాత ఇజ్రాయెల్‌ చంపిన అతిపెద్ద హమాస్‌ నేత అతడు.  అదే దాడిలో జొమ్మతాహిల్‌ అనే ఆయుధ తయారీ నిపుణుడు కూడా మరణిచాడు.  

బిగ్‌డేటాతో బిలాల గుట్టురట్టు..!

హమాస్‌కు ఉన్న అతిపెద్ద బలం సొరంగాల నెట్‌వర్క్‌. దీనిని ‘మెట్రో’గా  వ్యవహరిస్తారు. దీనిని ఇజ్రాయెల్‌ రాత్రివేళల్లో వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. దీనికోసం కొన్నేళ్లుగా గూఢచారుల నుంచి వచ్చిన సమాచారాన్ని సాంకేతికత సాయంతో విశ్లేషంచి వందల కిలోమీటర్ల మెట్రో మ్యాప్‌ను తయారు చేసింది. సొరంగం లోతు.. దానిపై ఉన్న నిర్మాణాల సమాచారం.. ఇలా ప్రతి ఒక్కటి ఇజ్రాయెల్‌ చేతికొచ్చాయి.  ఈ దాడుల్లో మొత్తం సొరంగాలను ధ్వంసం చేయలేదని ఇజ్రాయెల్‌ అంగీకరించింది. కానీ, మళ్లీ వాటిని వినియోగించడానికి అవకాశం లేకుండా మాత్రం ధ్వంసం చేశామని చెబుతోంది. 

అప్రమత్తం చేసిన ‘అల్కమిస్ట్‌’..!

యుద్ధరంగంలో ఉన్న ఇజ్రాయెల్‌ దళాలను కాపాడే బాధ్యత యూనిట్‌ 8200 వద్ద ఉన్న ‘అల్కమిస్ట్‌’ అనే అల్గారిథమ్‌ నిర్వహించింది. వివిధ మార్గాల్లో వస్తున్న సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించి అందజేసింది. హమాస్‌, పీఐజీ దళాలు ఎక్కడ దాడి చేసే అవకాశం ఉందో గుర్తించి.. అక్కడి దళాలను అప్రమతం చేశాయి. ఫలితంగా ఇజ్రాయెల్‌ దళాల వైపు ప్రాణనష్టం అత్యంత తక్కువగా ఉంది. 11 రోజుల యుద్ధంలో ఒమర్‌ తబీబీ అనే ఒక్క సైనికుడు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. యాంటీట్యాంక్‌ క్షిపణి వారి వైపు వస్తోందని హెచ్చరించారు. కానీ, అతడు ఆ దాడిలో మరణించాడు. ఇక ఐరన్‌డోమ్‌ పనితీరులో కూడా లక్ష్యాలను గుర్తించే కీలకమైన పనిమొత్తం ప్రత్యేక సాఫ్ట్‌వేర్లే చేశాయి. 

ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్‌ ఆయుధాలు బయటకు చెప్పినంత కచ్చితంగా దాడులు చేయలేదని అంటున్నారు. వారి దాడుల్లో పౌరులు కూడా మరణించడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. తమ ఆయుధ ప్రదర్శన కోసమే ఈ దాడులు చేసిందనే విమర్శలు కూడా వచ్చాయి.

ఆధునిక యుగంలో డేటా ఎంత కీలకమైందో హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరిగిన యుద్ధం చెప్పింది. గతంలో డేటా అంటే ఆధునిక కాల ఇంధనం అని చెబుతారు.. ఇప్పుడు ఆయుధం అని కూడా చెప్పొచ్చు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని