Odisha Train tragedy: ‘లగ్జరీ ట్రైన్స్‌కాదు.. కామన్‌ మ్యాన్‌ను పట్టించుకోండి’

Opposition on odisha accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై విపక్ష పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అదే సమయంలో సిగ్నలింగ్‌ వ్యవస్థపై సందేహాలు లేవనెత్తారు. రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేశారు. 

Published : 03 Jun 2023 14:00 IST

దిల్లీ: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై (Odisha train accident) దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. మూడు రైళ్లు ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో 200 మందికి పైగా మృతిచెందారన్న వార్త యావత్‌ దేశాన్ని కలచివేస్తోంది. దీనిపై రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్పందించారు. రైలు ప్రమాద ఘటనలో (odisha Rail tragedy) మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే సమయంలో పలువురు నేతలు ఈ ప్రమాద ఘటనపై ప్రశ్నలు లేవనెత్తారు. సిగ్నలింగ్‌, కవచ్‌ వ్యవస్థల గురించి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేశారు.

ఒడిశా రైల్వే ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సాకేతి గోఖలే ట్వీట్‌ చేశారు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సీపీఐ (ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య సైతం ఇదే తరహా ప్రశ్నలు లేవనెత్తారు. మన రైల్వేలో సిగ్నలింగ్‌ వ్యవస్థ, భద్రతా వ్యవస్థలు లేవా? ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణమేనా? అని ప్రశ్నించారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

ఒడిశా ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి రాజీనామా చేయాలని సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కేవలం లగ్జరీ రైళ్లపైనే దృష్టి పెట్టిందని, సాధారణ ప్రజలను గాలికొదిలేసిందన్నారు. దాని ఫలితమే ఈ పెను విషాదమని అని విమర్శించారు. రైల్వే ప్రమాద ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా తీసుకొచ్చిన పరికరాలు, సాంకేతికత ఏమయ్యాయని ప్రశ్నించారు.

మరోవైపు ప్రమాదం నేపథ్యంలో పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కార్యక్రమాల నిర్వహణకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. అలాగే, ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదిక విడుదలను వాయిదా వేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రమాదంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఒడిశా రైలు ప్రమాదం.. Live Updates

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని