Winter Session: కేంద్రంపై పోరుకు విపక్షాలు సిద్ధం.. కాంగ్రెస్‌ భేటీకి తృణమూల్‌, ఆప్‌ హాజరు

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) భాగంగా పలు అంశాలపై పోరాటం చేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఏర్పాటు చేసిన సమావేశానికి టీఎంసీ, ఆప్‌తో సహా పలు విపక్ష పార్టీలు హాజరై చర్చించాయి.

Published : 08 Dec 2022 01:49 IST

దిల్లీ: ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరాడేందుకు విపక్ష పార్టీలు (Opposition) ఏకం కావాలని కొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ (Congree) లేకుండానే భాజపాపై పోరాటం చేసేందుకు పలు పార్టీలు సంప్రదింపులు కూడా జరిపాయి. ఈ తరుణంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పలు విపక్ష పార్టీలతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు హాజరై ఆశ్చర్యపరిచాయి.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, సరిహద్దు భద్రత, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలను విపక్ష పార్టీలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. ఈ సమస్యలను లేవనెత్తడంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఈ ఉదయం ఓ సమావేశం ఏర్పాటు చేశారు.  తమతో కలిసి వచ్చే పార్టీలు రావాలని పిలుపునివ్వడంతో.. ఇందుకు వామపక్ష పార్టీలతో పాటు డీఎంకే, ఆర్జేడీ, ఎన్‌సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌ఎస్పీలు హాజరయ్యాయి. వీటితోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress), ఆమ్‌ఆద్మీ పార్టీలు కూడా ఖర్గే సమావేశానికి వచ్చాయి.

వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ ఇటువంటి సమావేశమే ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ రెండు పార్టీలు అప్పట్లో దూరంగా ఉన్నాయి. పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మమతా బెనర్జీ ఆ పార్టీ ఎంపీలకు సూచించారనే వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా పార్లమెంటులో తృణమూల్‌ నేతలు తమ నిరసనలను ప్రత్యేకంగా కొనసాగించారు. దీంతో తృణమూల్‌పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. భాజపా విషయంలో మమతా బెనర్జీ సున్నితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది. ఈ తరుణంలో శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై ప్రభుత్వంపై పోరాడేందుకు విపక్షాలు ముందుకు రావడం గమనార్హం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 29వరకు కొనసాగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని