రైతుల ఆందోళన..మరో షాహీన్‌బాగ్‌గా మార్చొద్దు!

పార్లమెంటులో విస్తృత చర్చ జరిపిన తర్వాతే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు భారతీయ జనతా పార్టీ స్పష్టంచేసింది.

Updated : 03 Feb 2021 14:58 IST

రాజ్యసభలో భాజపా

దిల్లీ: పార్లమెంటులో విస్తృత చర్చ జరిపిన తర్వాతే నూతన వ్యవసాయ చట్టాలకు ఆమోదం తెలిపినట్లు భారతీయ జనతా పార్టీ స్పష్టంచేసింది. అయినప్పటికీ రైతుల సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంలో రైతుల ఉద్యమాన్ని మరో షాహీన్‌బాగ్‌గా మార్చవద్దని ప్రతిపక్ష పార్టీలకు భాజపా విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపే సందర్భంలో మాట్లాడిన భాజపా సభ్యుడు భువనేశ్వర్‌ కలితా, రైతులపై ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. తాజా చట్టాల ద్వారా రైతులకు మరిన్ని హక్కులు కల్పించిందని, వీటి వల్ల రైతులకు ప్రయోజనాలే ఎక్కువని స్పష్టంచేశారు. రాజ్యసభ వ్యవహారాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోన్న ప్రతిపక్ష సభ్యలపై విరుచుకుపడ్డ కలితా, పార్లమెంట్‌ ఉభయసభల్లో సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత మాత్రమే సాగు చట్టాలకు ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అయినప్పటికీ వ్యవసాయశాఖ, రైల్వేశాఖ మంత్రులు రైతులతో పలు దఫాల్లో చర్చలు జరుపుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రైతులకున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రభుత్వం వారితో చర్చలకు సిద్ధంగా ఉందని.. రైతులకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విపక్షాలు చేసిన రాద్ధాంతాన్ని భాజపా సభ్యుడు మరోసారి గుర్తుచేశారు. అదే తరహాలో వ్యవసాయ చట్టాలపై వారికున్న అభ్యంతరాలను తెలుపుతూ మరో షాహీన్‌బాగ్‌గా మార్చాలని అనుకుంటున్నట్లు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

ఇదిలాఉంటే, రెండు నెలలుగా ఆందోళన చేస్తోన్న రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. రాజ్యసభలో దాదాపు 15గంటల పాటు వీటిపై చర్చ జరిపేందుకు అంగీకరించాయి.

ఇవీ చదవండి..
ట్రాక్టర్‌ ర్యాలీపై పిటిషన్లు తిరస్కరించిన సుప్రీం
ఆ తర్వాతే షాహీన్‌బాగ్‌ నిరసనలపై విచారణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని