Kiren Rijiju: ‘న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే’.. కేంద్రమంత్రిపై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు

మాజీ న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ ఉద్దేశిస్తూ న్యాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఆయన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తాయని మండిపడ్డాయి.

Published : 20 Mar 2023 00:44 IST

దిల్లీ: మాజీ న్యాయమూర్తులపై కేంద్రం న్యాయశాఖ  కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషించేలా కొందరు విశ్రాంత న్యాయమూర్తులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారంటూ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో రిజిజు వ్యాఖ్యానించారు. దీనిపై శివసేన (ఉద్ధవ్‌ బాల్‌ ఠాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjai Raut) స్పందిస్తూ కేవలం ఆరోపణలు చేయడం కాదని సాక్ష్యాలు చూపించాలని విమర్శించారు. ముంబయిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ ఇదెక్కడి ప్రజాస్వామ్యం. న్యాయవ్యవస్థను బెదిరించడం న్యాయశాఖ మంత్రికి తగునా? ప్రభుత్వానికి తల వంచకుండా న్యాయం కోసం కృషి చేస్తున్నవారికి ఈ ప్రవర్తన ముప్పుగా పరిణమిస్తుంది. ఇది కచ్చితంగా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని విమర్శించడమంటే.. దేశానికి వ్యతిరేకంగా పని చేసినట్లుకాదని ఆయన అన్నారు.

మంత్రి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి అనుచిత కామెంట్లు చేయడం సరికాదని రాజ్యసభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ జవహార్‌ సర్కార్‌ ట్విటర్‌ వేదికగా విమర్శించారు. స్వాతంత్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదని, అప్పట్లో హిందూ మహాసభ బ్రిటిష్‌ వారికి మద్దతు పలికిందని ఆరోపించారు. న్యాయశాఖ మంత్రి మాటలు అన్యాయంగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. కిరణ్‌ రిజిజు న్యాయశాఖ మంత్రా? అన్యాయశాఖ మంత్రా? అంటూ సీపీఐ (ఎం) నేత, కేరళ ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్‌ ఇసాక్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని