PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్‌

PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. దీంతో ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 03 Jul 2024 13:41 IST

దిల్లీ: ప్రతిపక్షాలు తమ ప్రవర్తనతో రాజ్యసభను అవమానపర్చాయని ప్రధాని మోదీ (PM Modi) దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ నేడు రాజ్యసభ (Rajya Sabha)లో సమాధానమిచ్చారు. అయితే, ఆయన మాట్లాడుతుండగా.. విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వాకౌట్‌ చేశాయి. దీనిపై ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారంటూ ఛైర్మన్‌ దుయ్యబట్టారు.

మర్యాదను విడిచి వెళ్లారు: ఛైర్మన్‌ ఆగ్రహం

ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే మోదీ ప్రసంగం కొనసాగించగా.. ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు (Opposition Walkout). దీంతో మోదీ ప్రసంగాన్ని నిలిపివేశారు. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్‌ మాట్లాడుతూ.. ‘‘విపక్ష నేతలు సభను కాదు.. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నాం. కానీ, వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు. రాజ్యాంగంపై హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదు. రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు. జీవితానికి మార్గదర్శకం’’ అని విపక్షాలపై మండిపడ్డారు. అనంతరం మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అవును.. మాది మూడోవంతు ప్రభుత్వమే: మోదీ

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) పార్టీపై ప్రధాని మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. ఇది సాధారణ విషయం కాదు. పదేళ్లుగా సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోంది. మా పాలనను ప్రజలు మరోసారి సమర్థించారు. దేశానికి సేవ చేసే వారినే ప్రజలు ఆశీర్వదించారు. మాపై వారు చూపిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఓటర్లు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి.. విభజన ఎజెండాను ఓడించారు. ఈ పరిణామాలతో కొందరు (కాంగ్రెస్‌) అసంతృప్తిగా ఉన్నారు. దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ కాంగ్రెస్‌ నేత పదే పదే మమ్మల్ని ‘మూడో వంతు ప్రభుత్వం’ అని విమర్శిస్తున్నారు. అది నిజమే.. మేం పాలనలో పదేళ్లు పూర్తి చేసుకున్నాం. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటాం. మూడో వంతు ముగిసింది. ఇంకా రెండు వంతులు మిగిలి ఉంది’’ అని మోదీ (Narendra Modi) కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. విపక్షాల హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ పాలన నడిచేదంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.

రాజ్యాంగం (Constitution)పై దాడి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను ప్రధాని తిప్పికొట్టారు. ‘‘రాజ్యాంగం అంటే కేవలం ఆర్టికల్స్‌ను అనుసరించడం మాత్రమే కాదు. అది లైట్‌హౌస్‌లా మనకు మార్గనిర్దేశం చేస్తుంది. రాజ్యాంగ భావనను విద్యార్థులకు చేరవేస్తున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలి’’ అని మోదీ వివరించారు. ఆర్థిక వృద్ధిలో భారత్‌ను పది నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చామని.. రానున్న ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి చేరుస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని