Parliament: చమురు ధరల పెంపుపై విపక్షాల నిరసన.. దద్దరిల్లిన పార్లమెంట్‌

పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలతో పార్లమెంట్‌ ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని

Updated : 23 Mar 2022 11:45 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలతో పార్లమెంట్‌ ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. అయినప్పటికీ విపక్షాల నిరసనలు ఆగలేదు. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ ఇలానే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఛైర్మన్‌ వారించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 

దాదాపు నాలుగు నెలల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా ఈ ధరల పెంపు కొనసాగింది. రెండు రోజుల్లోనే లీటర్‌ పెట్రోల్ ధర రూ.1.60 పెరగడం గమనార్హం. అటు వంట గ్యాస్‌ సిలిండర్‌పైనా రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని