Vaccination: 44 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్లు

ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనాపై పోరాటంలో....

Updated : 08 Jun 2021 21:17 IST

దిల్లీ: ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనాపై పోరాటంలో సార్వత్రిక వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకొనేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 44 కోట్ల డోసులకు పైగా ఆర్డర్‌ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల కోసం మంగళవారం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. కొవిషీల్డ్‌ పంపిణీ చేస్తున్న పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కొత్తగా మరో 25కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇవ్వగా.. కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు 19కోట్ల డోసులకు ఆర్డర్‌ చేసింది. మొత్తంగా ఈ 44 కోట్ల టీకా డోసులు డిసెంబర్‌ కల్లా అందుబాటులోకి రానున్నాయని కేంద్రం తెలిపింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30శాతం అడ్వాన్సు విడుదల చేసినట్టు వెల్లడించింది. 

మరోవైపు, కార్బివాక్స్‌ టీకా 30కోట్ల డోసుల కోసం బయోలాజికల్‌ -ఇ సంస్థకు ఆర్డర్‌ చేశామని.. ఇది సెప్టెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తుందని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.19కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 24కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయగా.. వీటిలో 23.47కోట్ల డోసులు వినియోగం (వృథాతో కలిపి) జరిగినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,19,46,925 డోసులు రాష్ట్రాల వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు