PM Modi: మా ప్రాధాన్యం ఓటు బ్యాంకు కాదు.. అభివృద్ధి మాత్రమే : మోదీ

తమ ప్రభుత్వం ఓటు బ్యాంకుకు ప్రాధాన్యం ఇవ్వదని కేవలం అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో పర్యటించిన ఆయన.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభ, శంకుస్థాపనలు చేశారు.

Published : 19 Jan 2023 15:35 IST

యాద్గిర్‌ (కర్ణాటక): 21వ శతాబ్దంలో భారత్‌ అభివృద్ధికి నీటి భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. కర్ణాటక యాద్గిర్‌ జిల్లాలో నీటి పారుదల, తాగునీరుకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యాక్రమాలతో పాటు జాతీయ రహదారి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వచ్చే 25ఏళ్లు ప్రతిపౌరుడికి, దేశానికి అమృత కాలమని అన్నారు. ఈ సమయంలోనే అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

‘పొలాల్లో మంచి పంటలు, పరిశ్రమలను విస్తరించుకున్నప్పుడే భారత్‌ అభివృద్ధి చెందుతుంది. మన ప్రభుత్వ ప్రాధాన్యం ఓటు బ్యాంకు కాదు. అభివృద్ధే మనకు ప్రాధాన్యం. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం (కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారం) ఉంటే రెట్టింపు సంక్షేమం ఉంటుంది. దీనివల్ల కర్ణాటక ఎలా ప్రయోజనం పొందుతుందో మీరు చూడొచ్చు. కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న పార్టీ (కాంగ్రెస్‌) అభివృద్ధిని పట్టించుకోలేదు. యాద్గిర్‌తోపాటు ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను వెనకబడిన ప్రదేశాలుగా ప్రకటించడానికే ఆ పార్టీ తన బాధ్యతను పరిమితం చేసింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 3కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవని.. ప్రస్తుతం 11కోట్ల ఇళ్లకు అందుతున్నాయని చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మే లోపే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం అక్కడ 224 స్థానాలుండగా కనీసం 150 చోట్ల విజయం సాధించాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఈ నెలలోనే రాష్ట్రంలో రెండోసారి పర్యటించారు. జనవరి 12న హుబ్బళ్లిలో నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మోదీ.. భారీ రోడ్‌షో కూడా నిర్వహించారు. తాజాగా రూ. పదివేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభ, శంకుస్థాపనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని