Twitter: ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌.. స్పందించిన భారత ప్రభుత్వం

నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న, నకిలీ వార్తలను ప్రసారం చేసేలా ఉన్న కొన్ని కంటెంట్లను, ఖాతాలను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ రెండేళ్లలో పలుమార్లు ఆదేశించింది.

Updated : 28 Oct 2022 14:08 IST

దిల్లీ: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది.

‘యజమానులతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమ సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలు, చట్టాలు అలాగే కొనసాగుతాయి’ అని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది. అలాగే ట్విటర్‌లో నిషేధం ఎదుర్కొంటోన్న వారి గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని అడగ్గా.. మంత్రి పరోక్షంగా స్పందించారు. కొన్నినెలల సంప్రదింపులు తర్వాత అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల కానున్నాయని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న, నకిలీ వార్తలను ప్రసారం చేసేలా ఉన్న కొన్ని కంటెంట్లను, ఖాతాలను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ రెండేళ్లలో పలుమార్లు ఆదేశించింది. అయితే వాటిని తొలగించేందుకు సామాజిక మాధ్యమం అంగీకరించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. ఇది ప్రభుత్వం, సామాజిక మాధ్యమ సంస్థ మధ్య విభేదాలకు దారితీసింది.

కాగా, వివిధ పరిణామాల అనంతరం ఎట్టకేలకు ఆ సంస్థ కొనుగోలు ప్రక్రియను మస్క్‌ పూర్తి చేశారు. దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు. విద్వేషపూరిత వ్యవహార శైలితో సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని ట్విటర్ ఆమెపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది కొనసాగుతోంది. దానిని ఎత్తివేయాలంటూ మస్క్‌కు నెటిజన్లు చేసిన అభ్యర్థనలను ఆమె షేర్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని