Gujarat: వివాహ విందులో కలుషితం.. 1200 మందికి అస్వస్థత

వివాహ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు ఆరగించిన 1200 మంది అనారోగ్యానికి గురయ్యారు........

Published : 06 Mar 2022 01:39 IST

అహ్మదాబాద్‌: వివాహ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు ఆరగించిన 1200 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహ్‌సనా జిల్లాలో చోటుచేసుకుంది. విస్​నగర్ తాలుకా సవాలా గ్రామంలో కాంగ్రెస్‌ నేత కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి జనం భారీగా తరలివచ్చారు. కాగా విందు ఆరగించిన వీరిలో  1,200 మందికిపైగా అనారోగ్యం బారిన పడ్డారు. బాధితులందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కలుషిత ఆహారం తినడం వల్లే వీరంతా అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు.

స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడి వివాహానికి చాలా మంది హాజరవగా.. విందులో శాఖాహారంతో పాటు మాంసాహారం సైతం సరఫరా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘వివాహ విందును ఆరగించిన తర్వాత 1,200 మందికి పైగా అతిథులు జబ్బు పడ్డారు. చాలా మంది వాంతులు చేసుకున్నారు. డయేరియా వంటి సమస్యలు తలెత్తాయి. వీరందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించాం’ అని మెహ్‌సనా ఎస్పీ పార్థరాజ్​సిన్హ్ గోహిల్ వెల్లడించారు. కార్యక్రమంలో సరఫరా చేసిన ఆహారం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపినట్లు తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్ శాఖ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టిందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని