ప్రభుత్వ ఆఫీసు సెల్లార్‌లో 2.31కోట్ల నగదు.. కేజీ బంగారం

ఓ ప్రభుత్వ కార్యాలయంలోని సెల్లార్‌లో పెద్ద ఎత్తున లెక్కల్లోకి రాని నగదు, బంగారం బయటపడటం రాజస్థాన్‌ (Rajasthan)లో అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది.

Published : 20 May 2023 12:13 IST

జైపుర్‌: దేశంలో చలామణిలో ఉన్న రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన వేళ.. రాజస్థాన్‌ (Rajasthan)లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజధాని జైపుర్‌లోని యోజనా భవన్‌ (Yojna Bhawan) బేస్‌మెంట్‌లో లెక్కల్లోకి రాని రూ.2.31 కోట్ల నగదు, కిలో బంగారాన్ని అధికారులు గుర్తించారు. సెల్లార్‌లోని తాళం వేసిన ఓ అల్మారాలో ఈ సొమ్ము బయటపడింది.

ఈ యోజనా భవన్‌లో ఐటీ విభాగం, జన్‌ ఆధార్‌ వంటి ఆఫీసులున్నాయి. ఈ భవనం బేస్‌మెంట్‌లో కొన్ని అల్మారాలు ఉండగా.. వాటిని చాలా నెలలుగా ఉపయోగించడం లేదు. దీంతో తాళాలు వేసి ఉంచారు. శుక్రవారం ఏదో అవసరం నిమిత్తం ఈ అల్మారాలను తెరవగా అందులో ఒక ట్రాలీ సూట్‌కేస్‌ కన్పించింది. ఆ సూట్‌కేస్‌ను తెరిచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం ఉన్నాయి. దీంతో ఐటీ డిపార్ట్‌మెంట్‌ (IT Dept) అదనపు డైరెక్టర్‌ మహేశ్‌ గుప్తా వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ సూట్‌కేసులో మొత్తం రూ. 2.31 కోట్ల విలువైన రూ.2వేలు, రూ.500 నోట్లను గుర్తించారు. దీంతో పాటు కిలో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot)కు అధికారులు సమాచారమిచ్చారు. మరోవైపు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, జైపుర్‌ కమిషనర్‌ హుటాహుటిన నిన్న అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘డబ్బు, బంగారంతో పాటు కొన్ని ఫైళ్లు కూడా అందులో ఉన్నాయి. వాటిని డిజిటలైజ్‌ చేశాం. తాళాలు వేసిన మరో రెండు కప్‌బోర్డులను కూడా తెరిచాం. ఈ బేస్‌మెంట్‌ను ఎక్కువగా ఆధార్‌ విభాగం సిబ్బంది వినియోగిస్తుంటారు. దీంతో ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. సీసీటీవీ ఫుజేట్‌ను కూడా పరిశీలిస్తున్నాం. డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అన్నది త్వరలోనే బయటపెడతాం’’ అని జైపుర్‌ పోలీసు కమిషనర్‌ ఆనంద్‌ శ్రీవాస్తవ తెలిపారు.

కాగా.. ఈ ఘటన నేపథ్యంలో అశోక్ గహ్లోత్‌ (Ashok Gehlot) సర్కారుపై ప్రతిపక్ష భాజపా (BJP) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘‘ప్రభుత్వ కార్యాలయం బేస్‌మెంట్‌లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారం బయటపడింది. అవినీతిపరులను ప్రభుత్వం రక్షిస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?’’ అని శాసనసభలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్‌ ట్విటర్‌లో దుయ్యబట్టారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని