Assam floods: అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు

వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని కారణంగా 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 

Published : 06 Jul 2024 14:50 IST

గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam)లో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర నది దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. డేంజర్‌ మార్కును దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో 24 లక్షల మంది ప్రభావితమయ్యారు.

నిమతి ఘాట్‌, గువాహటి, గోల్పరా, ధుబ్రి ప్రాంతాల్లో బ్రహ్మపుత నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దాని ఉపనదులైన బుర్హి దిహింగ్‌, డికౌ, దిసాంగ్‌, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి కూడా గ్రామాలను అతలాకుతలం చేస్తున్నాయి. కమ్రూప్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉండడం బాధాకరం. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తుపానుల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 64కి చేరింది.

వేల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా 63,490 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అత్యధికంగా ధుబ్రి జిల్లాలో 7 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దర్రాంగ్‌లో 1,86,108.. బార్పేటలో 1,39,399.. మెరిగావ్‌లో 1,46,045 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 47,103 మంది వరద బాధితులు 612 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి

ఈ ఏడాది రాష్ట్రంలో ఆరుసార్లు వరదలు సంభవించాయి. వరదల కారణంగా కజిరంగా నేషనల్‌ పార్క్‌లో ఇప్పటివరకు 31 జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ దిబ్రూగఢ్‌లోని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. అందరిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మృణాల్‌ సైకియా తన మొబైల్‌ కిచెన్‌ ద్వారా వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని