E-Shram: ఈ-శ్రమ్‌ పోర్టల్‌ రిజిస్ట్రేషన్లు @25 కోట్లు

అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు కేంద్రం ప్రారంభించిన ‘ఈ- శ్రమ్‌’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు 25 కోట్ల మందికిపైగా కార్మికులు...

Published : 10 Feb 2022 23:55 IST

దిల్లీ: అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు కేంద్రం ప్రారంభించిన ‘ఈ- శ్రమ్‌’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు 25 కోట్ల మందికిపైగా కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. దాదాపు 160 వివిధ వృత్తులవారు నమోదవుతారని భావించగా.. 400 కంటే ఎక్కువ వృత్తులకు సంబంధించిన శ్రామికులు తమ వివరాలు సమర్పించారని చెప్పారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. దేశంలో దాదాపు 38 కోట్ల మంది అసంఘటిత రంగం కార్మికులు ఉన్నారు. వారి డేటాబేస్‌ను రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రారంభించింది.

కార్మికుల నైపుణ్య పెంపుదల, సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. మరోవైపు ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ యోజన పెన్షన్ పథకానికి జనవరి 28 నాటికి 46 లక్షల మందికి పైగా అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. జనవరి 27 నాటికి 28 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రధాన మంత్రి స్వనిధి పథకం కింద రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. దేశంలో నిరుద్యోగంపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవల విడుదల చేసిన గణాంకాల విషయంలో మంత్రి మాట్లాడుతూ.. వాస్తవాలను ధ్రువీకరించాల్సిన అటువంటి నివేదికపై సమాధానం ఇవ్వలేమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని