Delhi: ఉచిత విద్యుత్‌ పథకానికి 37లక్షల మంది దరఖాస్తు

ఉచిత విద్యుత్‌ పథకం కోసం నవంబర్‌ 15 నాటికి 37లక్షల మంది వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నట్లు దిల్లీ అధికారులు వెల్లడించారు.

Published : 16 Nov 2022 00:23 IST

దిల్లీ: దేశ రాజధానిలో వినియోగదారులకు ఉచిత కరెంటు పథకాన్నిఅక్కడి ఆప్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ పథకం కోసం నవంబర్‌ 15 నాటికి 37లక్షల మంది వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇది అందరికీ ఉచితం కాగా.. ఇప్పటినుంచి కేవలం దరఖాస్తు చేసుకున్న వారికే ఈ సబ్సిడీని అందిస్తామని దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

దిల్లీలో మొత్తం 58లక్షల విద్యుత్‌ వినియోగదారులు ఉండగా.. అక్టోబర్‌ 31 నాటికి 35లక్షల మందే ఉచిత విద్యుత్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువును నవంబర్‌ 15 వరకు పొడిగించడంతో మరో 2లక్షల మందికి అవకాశం లభించింది. నవంబర్‌ 15వరకు దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబర్‌ 1 నుంచి ఉచిత కరెంటు ప్రయోజనం పొందనున్నారు. ఇలా సబ్సిడీ పొందాలనుకునే వారు ప్రతినెల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అంతకుముందు 47లక్షల మంది వినియోగదారులు సబ్సిడీని పొందారు. వీరిలో 30 లక్షల మందికి సున్నా బిల్లు రాగా.. 16 నుంచి 17 లక్షల మందికి 50శాతం సబ్సిడీ లభించింది. దిల్లీలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించేవారికి పూర్తి ఉచితం. 400 యూనిట్ల వరకు వాడేవారికి 50శాతం సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం కోసం 2022-23 బడ్జెట్‌లో కేజ్రీవాల్‌ ప్రభుత్వం రూ.3,250 కోట్లు కేటాయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు