Prisoners : హిమాచల్‌ జైళ్లలో.. 40శాతం మంది ఖైదీలపై ఆ కేసులే..!

హిమాచల్‌ ప్రదేశ్‌ను మాదకద్రవ్యాల సరఫరా వెంటాడున్నట్లు తెలుస్తోంది. ప్రతిఏటా వందల సంఖ్యలో నిందితులు పట్టుబడుతున్నారు. అక్కడి జైళ్లలో ఉన్న వారిలో 40శాతానికిపైగా ఖైదీలపై మాదక ద్రవ్యాల సంబంధిత కేసులే ఉండటం గమనార్హం.

Published : 05 Dec 2022 19:40 IST

షిమ్లా:  హిమాచల్‌ ప్రదేశ్‌ను మాదక ద్రవ్యాల అక్రమరవాణా (Drugs) సరఫరా ఎంతగానో వేధిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఉన్న ఖైదీల్లో(Prisoners)  40శాతానికన్నా ఎక్కువ మందిపై డ్రగ్స్‌ కేసులే ఉండటం పరిస్థితికి అద్ధం పడుతోంది. రాష్ట్రంలో నేరాల తీరు, పెండింగు కేసులకు సంబంధించి హిమాచల్‌ పోలీసులు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం 14జైళ్లు ఉండగా వాటిలో ఖైదీల సామర్థ్యం 2437. కానీ ప్రస్తుతం వాటిల్లో 2909 మంది ఉన్నారు. అందులో 68శాతం మంది విచారణ ఖైదీలు కాగా మరో 32 మంది శిక్ష పడివారు. అయితే, వారందరిలో 1189 (40.8శాతం) మందిపై మాదక ద్రవ్యాల సంబంధిత కేసులే ఉండటం గమనార్హం. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (NDPS) కింద మొత్తం 7942 కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో సగం కేసులు గత రెండేళ్లుగా విచారణ దశలో ఉండగా.. మిగతావి అంతకంటే ఎక్కువ కాలంగా పెండింగులోనే ఉండిపోయాయి. ఈ ఏడాది మొత్తం 346 కేసుల్లో తీర్పు వెలువడగా.. అందులో 126 మందికి శిక్ష పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న 2307 మందిని పోలీసులు గుర్తించగా.. అందులో 80శాతం మంది ఆ రాష్ట్రానికి చెందినవారే. కాగా మరో 18శాతం మంది ఇతర రాష్ట్రాలు, రెండు శాతం (49 మంది) విదేశీయులు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో మాదకద్రవ్యాలకు సంబంధించి ప్రతిఏటా సుమారు 2వేల మందిని అరెస్టు చేస్తున్నామని, వాటిలో 1500 కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 1194మందిపై ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదు చేయగా.. వారినుంచి వందల కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు హిమాచల్‌ డీజీపి సంజయ్‌ కుందూ వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు