Published : 24 Jun 2022 16:10 IST

Vaccines Impact: భారత్‌లో.. 42లక్షల మరణాలను నివారించిన వ్యాక్సిన్లు

ది లాన్సెట్‌ నివేదిక వెల్లడి

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ (Coronavirus) మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్లు (Vaccine) అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అంతేకాకుండా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వాస్తవ ఫలితాల్లోనూ తేలడం ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ఒక్క ఏడాదిలోనే (2021 వరకు) 42 లక్షల మరణాలను వ్యాక్సిన్లు నివారించినట్లు (Prevent) తాజా అధ్యయనం పేర్కొంది. వ్యాక్సిన్‌ పంపిణీతో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగిన మరణాలకు సంబంధించిన ఈ అధ్యయనం ది లాన్సెట్‌ (The Lancet Infectious Diseases) జర్నల్‌లో ప్రచురితమైంది.

వ్యాక్సిన్ల పంపిణీ మొదలుపెట్టిన తొలి సంవత్సరంలో కొవిడ్‌ మరణాల నివారణ ఏవిధంగా ఉందనే విషయంపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ (Imperial College London) నిపుణులు అధ్యయనం చేపట్టారు. డిసెంబర్‌ 8, 2020 నుంచి డిసెంబర్‌ 8, 2021 మధ్యకాలంలో నివారించగలిగిన కొవిడ్‌ మరణాలను తాజా అధ్యయనం ద్వారా అంచనా వేశారు. ‘వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వల్ల 2021లో భారత్‌లో 42,10,000 కొవిడ్‌ మరణాలను నివారించగలిగారు. ఇది మొత్తంగా అంచనా వేసినవి మాత్రమే. కచ్చితంగా చూస్తే 36,65,000 నుంచి 43,70,000 మధ్యలో ఉండవచ్చు’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఒలివెర్‌ వాట్సన్‌ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌తో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న భారత్‌లో విస్తృతంగా వ్యాక్సినేషన్‌ (Vaccination) పంపిణీ ఎంతో ప్రభావాన్ని చూపించిందన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 5,24,941 మరణాలు చోటుచేసుకోగా వాస్తవానికి ఈ సంఖ్య 10రెట్లు అధికంగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో 47లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల నివేదించింది. అయితే, దేశంలో కొవిడ్‌ మహమ్మారి సమయంలో 51,60,000 (48,24,000-56,29,000) మరణాలు సంభవించి ఉండవచ్చనే అంచనాల ఆధారంగా వీటిని రూపొందించామని లండన్‌ పరిశోధకులు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది..

కొవిడ్‌ మరణాల వాస్తవ ఫలితాలను పరిగణనలోనికి తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 3.14కోట్ల కొవిడ్‌ మరణాలు సంభవిస్తాయనుకుంటే.. అందులో దాదాపు 2కోట్ల (1.98కోట్ల) మరణాలను వ్యాక్సిన్‌లు నివారించగలిగినట్లు తాజా నివేదిక అంచనా వేసింది. 2021 చివరినాటికి ప్రతి దేశంలో కనీసం 40శాతం జనాభాకు వ్యాక్సిన్‌ అందించడం వల్ల మరో 5,99,300 మంది ప్రాణాలను కాపాడుకునే వాళ్లమని పేర్కొంది. దాదాపు 185 దేశాల్లో అధికారిక లెక్కల కంటే వాస్తవ మరణాల సంఖ్యతో ఈ అంచనాలు వేసినట్లు తెలిపింది. అయితే, ఈ విశ్లేషణలో చైనాను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని.. ఒకవేళ తీసుకుంటే తాజా గణాంకాల్లో చాలా మార్పు ఉంటుందని పేర్కొంది. మొత్తంగా ఇప్పటివరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం చూసినా.. వ్యాక్సిన్‌లు పంపిణీ చేయకుంటే దాదాపు 1.81కోట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని తాజా అధ్యయనం వెల్లడించింది.

ఇదిలా ఉంటే, తాజా అధ్యయనానికి పలు పరిమితులు ఉన్నట్లు అధ్యయనకర్తలు వెల్లడించారు. ముఖ్యంగా ఏ రకమైన వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.. ఎలా పంపిణీ చేశారు.. ప్రతి దేశంలో కొత్త వేరియంట్‌లు వెలుగు చూసిన కచ్చితమైన సమయం.. వంటి అంశాల ఆధారంగా తాజా అంచనాలను రూపొందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా వైరస్‌ సోకిన వ్యక్తుల వయసు, కొవిడ్‌ మరణాల నిష్పత్తి మధ్య ఉన్న సంబంధం ప్రతి దేశంలో ఒకేలా ఉంటుందని భావించామని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని