బాంబు పేలిన ఘటనలో 50కి చేరిన మృతులు

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే ఉన్నట్లు అఫ్గాన్‌ ప్రభుత్వం తెలిపింది....

Published : 09 May 2021 18:48 IST

కాబూల్: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే ఉన్నట్లు అఫ్గాన్‌ ప్రభుత్వం తెలిపింది. మరో వందమంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. పశ్చిమ కాబూల్‌లోని దష్ట్‌-ఎ-బార్చి జిల్లాలో సయద్‌ అల్‌ షాదా పాఠశాల వద్ద ఈ పేలుడు జరిగింది. మృతుల్లో అధిక మంది 11 నుంచి 15 ఏళ్ల మధ్యవారేనని ప్రభుత్వం తెలిపింది. దుర్ఘటన జరిగిన వెంటనే అక్కడికి అంబులెన్స్‌లు వెళ్లాయన్న అఫ్గాన్‌ ప్రభుత్వం.. పేలుడుపై ఆగ్రహంతో స్థానికులు వాటిని అడ్డుకొని దాడులకు తెగబడినట్లు పేర్కొంది. అధికారులు వారిని సముదాయించి అంబులెన్స్‌లను ఘటనా ప్రాంతానికి వెళ్లేలా చేశారని వివరించింది. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడి చేసినట్లు ఇప్పటివరకూ ప్రకటించలేదు. దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించిన తాలిబన్లు పేలుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు తమ దేశానికి పయనమైన మరుసటి రోజే ఈ దాడి జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని