60 మంది విద్యార్థినులు.. చీకట్లో 17కి.మీ నడిచివెళ్లి..!

హాస్టల్‌ వార్డెన్‌ వేధింపులతో విసిగిపోయిన ఓ పాఠశాల విద్యార్థినులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 17కి.మీ దూరంలో ఉన్న కలెక్టర్‌ కార్యాలయానికి చీకట్లోనే బయలుదేరి వెళ్లిన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. 

Published : 18 Jan 2023 00:16 IST

ఛాయీబాసా (ఝార్ఖండ్‌): ఒకవైపు హాస్టల్‌లో వసతుల లేమి.. మరోవైపు వార్డెన్‌ వేధింపులు..! స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం. దీంతో విసిగిపోయారు ఆ రెసిడెన్షియల్‌ పాఠశాల బాలికలు. ఇక జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 60 మంది విద్యార్థినులు బృందంగా బయల్దేరారు. చిమ్మచీకట్లోనే దాదాపు 17 కి.మీల దూరంలో ఉన్న కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లా ఖాంట్‌పానీలో ఉన్న కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతోన్న బాలికలను అక్కడి వార్డెన్‌ వేధింపులకు గురిచేస్తున్నారట. ముఖ్యంగా పాచిపోయిన ఆహారాన్ని పెడుతున్నారని, టాయిలెట్లను శుభ్రం చేయాలని, చిన్న తరగతుల విద్యార్థినులు నేలపైనే పడుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు బాలికలు ఆరోపణ. వీటిపై ప్రశ్నిస్తే వార్డెన్‌ దండించేదట. అంతేకాకుండా ఎవరైనా ఉన్నతాధికారులు తనిఖీకి వస్తే వారితో అబద్ధాలు చెప్పాలని బలవంతం చేసేవారట. దీంతో విసిగివేసారిన 11వ తరగతి విద్యార్థినులు.. డిప్యూటీ కమిషనర్‌ అనన్య మిత్తల్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఖాంట్‌పానీ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న ఛాయీబాసాకు బయలుదేరారు. 60 మంది బాలికలు చీకట్లోనే నడుచుకుంటూ వెళ్లారు. ఉదయం 7 గంటలకు ఛాయీబాసాలోని కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ వ్యవహారం కాస్త జిల్లా విద్యాశాఖలో కలకలం సృష్టించింది. వెంటనే అక్కడకు చేరుకున్న జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్‌(డీఎస్‌ఈ) అభయ్‌ కుమార్‌ శీల్‌.. విద్యార్థినుల బాధలు  విన్నారు. విద్యార్థినులకు స్థానిక ఎంపీ గీతా కోడా కూడా అండగా నిలిచారు. వీరి సమస్యలను డిప్యూటీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని