Published : 17 Jun 2022 02:08 IST

Corona: కొవిడ్‌ బిగ్‌ జంప్‌.. దిల్లీలో కేసులు ఎందుకలా పెరుగుతున్నాయ్‌?

వైద్య రంగ నిపుణులేం చెబుతున్నారంటే..

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా కేసులు (Corona virus) భారీగా పెరుగుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే అక్కడ 7,100కు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం ఈ మహమ్మారి ఉద్ధృతికి నిదర్శనం. దీంతో ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ వైద్యులు, వైద్యరంగ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. దిల్లీలో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాజిటివిటీ రేటు కూడా పైకి పోతోంది. జూన్‌ 7న 1.92శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జూన్‌ 15 నాటికి 7.01శాతానికి ఎగబాకింది. నిన్న ఒక్కరోజే దిల్లీలో 1,375 కొత్త కేసులు వెలుగుచూసినప్పటికీ ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం కాస్త ఊరటనిస్తోంది.

దిల్లీలో తాజా పరిస్థితిపై ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బీఎల్‌ షెర్వాల్‌ మాట్లాడుతూ.. ‘‘కేసులు పెరగడం చూసి భయపడొద్దు.. కాకపోతే ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ నిబంధనల పట్ల జనం అలసత్వం ప్రదర్శిస్తున్నారు గనక కేసులు పెరుగుతాయి. కరోనా రోగులు ఇప్పుడు మూడు నుంచి నాలుగు రోజుల్లోనే కోలుకొంటున్నారు. వారిలో జ్వరం, ఒళ్లునొప్పులు, నీళ్ల విరోచనాలు వంటివి లక్షణాలు కనబడుతున్నాయి. ఊపిరితిత్తులపై ప్రభావం చూపకపోవడం, ఆక్సిజన్‌ అవసరం రాకపోవడం వంటివి కాస్త ఊరటనిచ్చే అంశాలు’’ అని వివరించారు. దిల్లీలో మరోసారి కొవిడ్‌ కేసులు పెరగడానికి కారణం ప్రజలు కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేయడం, సెలవుల్లో ప్రయాణాలే కారణమంటూ గత వారం పలువురు నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే.

జూన్‌ 14, 15 తేదీల్లో నగరంలో రోజుకు వెయ్యికి పైగా కేసులు రాగా.. జూన్‌ 10 నుంచి 13 వరకు ఆ నాలుగు రోజులు మాత్రం 600లకు పైగా కేసులు చొప్పున వెలుగుచూశాయి. రోజురోజుకీ కొత్త కేసులు పెరుగుతుండటంతో దిల్లీలోని పలు ఆస్పత్రుల వైద్యులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మాస్క్‌ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, జనసమూహాలకు దూరంగా ఉంటూ అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచిస్తున్నారు. కానీ కేసులు పెరుగుదల చూసి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదంటోన్నారు.

10 రోజుల్లో  450శాతం పెరిగాయ్‌..

మే 10న దిల్లీలో 118 కేసులు నమోదు కాగా.. పాజిటివిటీ రేటు 4.38గా ఉండేది. ఒక మరణం నమోదైంది. అదే మే 8 నాటికి 14,22 కేసులు నమోదు కావడంతో 5.34కి పాజిటివిటీ రేటు చేరింది. అయితే, గత 10 రోజులుగా మాత్రం కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. జూన్‌ 6న 247 కేసులు రాగా.. జూన్‌ 15న 1300కు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే మొత్తంగా 7,175 పాజిటివ్‌ కేసులు వచ్చినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ పది రోజుల వ్యవధిలోనే కొవిడ్‌ కేసుల పెరుగుదల 450శాతంగా ఉందని అధికారులు తెలిపారు.దిల్లీలో ఇప్పటివరకు మొత్తం 19,15,905 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో 26,223మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,643 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని