Liquor: ఆ రాష్ట్రాల్లో 85 లక్షల లీటర్లకు పైగా మద్యం సీజ్‌!

ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో 85లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ....

Published : 10 Mar 2022 02:06 IST

దిల్లీ: ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో 85లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో దాదాపు 70శాతం పంజాబ్‌లోనే సీజ్‌ చేసినట్టు తెలిపింది. ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, భారీగా మద్యంతో పాటు ఆయా రాష్ట్రాల్లో రూ.575.39 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ పేర్కొంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, విలువైన లోహాల పంపిణీని నిరోధించేలా ఎన్నికల సంఘం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నిఘా బృందాలను ఏర్పాటు చేయగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా జప్తు చేసిన మొత్తం రూ.1061.87 కోట్లు ఉంటుందని తెలిపింది. 2017 ఎన్నికలతో పోలిస్తే (రూ.299.84కోట్లు) ఇది మూడున్నర రెట్లు అధికమని అధికమని వెల్లడించింది. 

జనవరి 8 నుంచి 85,27,227 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసినట్టు ఈసీ తెలిపింది. వీటిలో అత్యధికంగా పంజాబ్‌లో 59,65,496 లీటర్లు (రూ.36.79 కోట్లు) స్వాధీనం చేసుకోగా.. యూపీలో 22,94,614 లీటర్లు (రూ.62.13 కోట్లు), ఉత్తరాఖండ్‌లో 97,176 లీటర్లు (రూ.4.79 కోట్లు), గోవాలో 95,446 లీటర్లు (రూ.3.57 కోట్లు), మణిపూర్‌లో 74,495 లీటర్లు (రూ.73లక్షలు) చొప్పున స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇకపోతే రూ.575.39 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా.. వీటిలో పంజాబ్‌లోనే 376.19 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ పట్టుకున్నట్టు తెలిపింది. అలాగే, మణిపూర్‌లో రూ.143.78 కోట్లు, యూపీ 48.48 కోట్లు, ఉత్తరాఖండ్‌ 5.66 కోట్లు, గోవా 1.28 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్టు పేర్కొంది. ఈ ఎన్నికల్లో రూ.154.52 కోట్ల నగదు, రూ.117.44 కోట్ల విలువ చేసే విలువైన లోహాలు, 106.52 కోట్ల విలువచేసే ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని