మాస్కులేని వారికి జరిమానా..₹54కోట్లు వసూలు!

దేశంలో కరోనా వైరస్‌ విలయం కొనసాగుతోంది. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు  ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలని ప్రభుత్వాలు పదే పదే కోరుతున్నాయి......

Updated : 05 May 2021 21:32 IST

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ విలయం కొనసాగుతోంది. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలని ఆరోగ్య రంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా అనేకమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. మహారాష్ట్రలోని ఒక్క ముంబయి మహా నగరంలోనే ఏడాది కాలంలో 26.87లక్షల మంది మాస్క్‌ నిబంధనల్ని ఉల్లంఘించగా.. వారి నుంచి  జరిమానా రూపంలో రూ.54 కోట్లు వసూలైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. బృహాన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. సెకండ్‌ వేవ్‌ ఇంత ఉద్ధృతంగా వ్యాపిస్తూ అనేకమందిని బలితీసుకుంటున్నా మంగళవారం ఒక్కరోజే 4314మంది మాస్క్‌లేకుండా బయట తిరుగుతూ పట్టుబడ్డారు.

అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నగరంలో 26,87,339మంది మాస్క్‌ నిబంధనల్ని ఉల్లంఘించారు.  వీరిలో 23,50,159మందిని బీఎంసీ అధికారులు పట్టుకోగా.. 3,13,289మందిని నగర పోలీసులు పట్టుకున్నారు. అలాగే, మరో 23891 మందిని రైల్వే అధికారులు పట్టుకొని ఫైన్‌ విధించారు. వీరందరి నుంచి జరిమానాగా దాదాపు రూ. 54కోట్లు వసూలైంది. ముంబయిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలంటూ గతేడాది ఏప్రిల్‌లోనే ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.మాస్క్‌ పెట్టుకోని వారికి రూ.200 చొప్పున జరిమానా విధించారు.  అలాగే, మాస్క్‌ నిబంధనలను కఠినంగా అమలు జరిగేలా మార్షల్స్‌ను కూడా మోహరించిన విషయం తెలిసిందే.  దేశంలోనే కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపిన మెట్రోపాలిటన్‌ నగరాల్లో ముంబయి అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ 6.61లక్షల కేసులు నమోదు కాగా.. 13,470మంది మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని