ఆక్సిజన్‌ సంక్షోభం ముగిసింది.. 3 నెలల్లో అందరికీ టీకా!

కరోనా సెకండ్‌ వేవ్‌ ధాటికి వణికిపోతోన్న దేశ రాజధానిలో ఆక్సిజన్‌ సంక్షోభం ముగిసిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

Published : 07 May 2021 22:19 IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ ధాటికి వణికిపోతున్న దేశ రాజధానిలో ఆక్సిజన్‌ సంక్షోభం ముగిసిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీంతో వచ్చే మూడు నెలల్లోనే దిల్లీలో అందరికీ వ్యాక్సిన్‌ అందించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. దిల్లీలో కరోనా పరిస్థితులపై కేబినెట్‌లో చర్చించి ఇందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అరవింద్ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

‘ప్రస్తుతం దిల్లీలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత సమస్య పరిష్కారం అయ్యింది. ఇప్పటినుంచి ఏ ఒక్క రోగికి అసౌకర్యం కలగదు’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తామని.. మూడు నెలల్లోనే అందరికీ అందిస్తామన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద నిత్యం అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా మూడో వేవ్‌ బారినపడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆదేశించారు.

దిల్లీలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 18వేలకుపైగా కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం గడిచిన రెండు వారాల్లోనే దాదాపు 6వేల మంది మృత్యువాతపడటం పరిస్థితికి అద్దం పడుతోంది. కొన్ని రోజులుగా నిత్యం అక్కడ దాదాపు 400లకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసమయంలో దిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. న్యాయస్థానాల జోక్యంతో చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సమస్యను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 2 లక్షల 34వేలు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని