Oxygen: ఈ ప్లాంట్లు ప్రాణం పోసేదెప్పుడు?

కొవిడ్‌ ఉద్ధృతి వల్ల ఆక్సిజన్‌ దొరక్క ఎంతోమంది చనిపోతున్న తరుణంలో కేంద్రం ప్రకటించిన ప్రాణవాయు

Updated : 01 May 2021 10:37 IST

మంజూరైన ఆక్సిజన్‌ తయారీ కేంద్రాలు 1213.. ఏర్పాటైంది 52 
తక్షణ అవసరాలు తీరడం మృగ్యమే

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి వల్ల ఆక్సిజన్‌ దొరక్క ఎంతోమంది చనిపోతున్న తరుణంలో కేంద్రం ప్రకటించిన ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలు (ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్సన్‌- పీఎస్‌ఏ ప్లాంట్లు) ఎప్పుడు ఏర్పాటవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం ప్రకటించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్లాంట్లతోపాటు ఇప్పటివరకు మంజూరైన 1213 పీఎస్‌ఏ యూనిట్లలో 52 మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. మిగతావి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయన్నదానిపై అయోమయం నెలకొంది. 
జనవరి 5న రూ.201.58 కోట్లతో 32 రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో 162 పీఎస్‌ఏ ప్లాంట్లను ‘పీఎం కేర్స్‌’ కింద కేంద్రం మంజూరు చేసింది. అంటే ఒక్కో ప్లాంటు ఖర్చు రూ.1.24 కోట్లన్నమాట. వీటి నిర్మాణ, నిర్వహణ బాధ్యతలన్నింటినీ వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని ‘సెంట్రల్‌ మెడికల్‌ సప్లై స్టోర్‌’కు కేంద్రం అప్పగించింది. 162 ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం 154.19 మెట్రిక్‌ టన్నులు. అంటే ఒక్కో యూనిట్‌ ద్వారా0.95 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి కావాల్సి ఉందన్నమాట. 
ఇవికాక డీఆర్‌డీవో  మరో 500 ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.  
పీఎం కేర్స్‌ కింద ఏప్రిల్‌ 25న మరో 551 ప్లాంట్లను కేటాయించారు. 
ఈ లెక్కన ఇప్పటివరకూ ప్రకటించిన 
1213 ప్లాంట్లు త్వరితగతిన ఏర్పాటై ఉంటే దేశంలో 1,152 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అదనంగా ఉత్పత్తి అయి ఉండేది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 9వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌లో ఇది దాదాపు 13%. ప్రాణాలు నిలపడానికి కొంతవరకూ ఇది అక్కరకొచ్చేది. 
ఆలస్యం.. అస్పష్టత.. 
కేంద్రం ఆక్సిజన్‌ ప్లాంట్లను ఘనంగా కేటాయించినా.. వాటి ఏర్పాటు అంశంలో ఆలస్యం జరుగుతోంది. జనవరి 5న మంజూరైన 162 ప్లాంట్లకు అంతకుముందే టెండర్లు పిలిచారు. అయినా ఏప్రిల్‌ 30 నాటికి 52 చోట్ల మాత్రమే అవి అందుబాటులోకి వచ్చాయి. మరో 87 యూనిట్లను బట్వాడా చేశామని, త్వరలో అవి ఏర్పాటవుతాయని శుక్రవారం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా.. 4నెలల క్రితం ప్రకటించిన ప్లాంట్లలోనే 23 ఏస్థాయిలో ఉన్నదీ ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది. 
తొలుత కేటాయించిన 162 ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతనే ‘సెంట్రల్‌ మెడికల్‌ సప్లై స్టోర్‌’ చూస్తోంది. ఏప్రిల్‌ 25న మంజూరు చేసిన 551 యూనిట్ల విషయంలో అయోమయం నెలకొంది. వాటికి ఎంత కేటాయించారు? ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తాయన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.
ఆసుపత్రుల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 7×9 అడుగుల స్థలం ఉంటే చాలు. కొన్ని వారాల్లోపే వీటిని ఏర్పాటు చేయొచ్చు. నెలకు 2 నుంచి 20 ప్లాంట్లు సరఫరా చేసే సంస్థలు దేశంలో ఉన్నాయి. 
డీఆర్‌డీవో ప్రకటించిన 500 ప్లాంట్లు అందుబాటులోకి రావడానికీ 3 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం అప్పటికల్లా దేశంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరి, తగ్గుముఖం పట్టే వీలుంది. ఆ సమయంలో ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. 
ఇప్పటివరకు ఏర్పాటుచేసిన 52 ప్లాంట్లను మినహాయించి పీఎం కేర్స్‌ కింద మిగిలిన 661 ప్లాంట్లలో నెలకు వంద చొప్పున ఏర్పాటు చేసినా.. అన్నీ అందుబాటులోకి రావడానికి దాదాపు 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వాటివల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం పెద్దగా నెరవేరే అవకాశం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని