Oxygen కొరత: డాక్టర్‌ సహా 8మంది మృతి

దేశంలో కరోనా కమ్మేసిన వేళ మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో ఓ వైద్యుడు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని బత్రా

Published : 01 May 2021 17:23 IST

దిల్లీ: దేశంలో కరోనా కమ్మేసిన వేళ మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో ఓ వైద్యుడు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని బత్రా ఆసుపత్రిలో శనివారం ఉదయం మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. ప్రాణవాయువు ట్యాంకర్లు ఆసుపత్రికి చేరేలోపే.. ఐసీయూలో ఉన్న ఆరుగురు కరోనా రోగులు.. వార్డులో ఉన్న ఇద్దరు మృతిచెందారు. ఇదే ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ ఆర్కే హింథనీ కూడా ఆక్సిజన్‌ లేక ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

‘‘మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆక్సిజన్‌ అయిపోయింది. అంతకంటే ముందే ప్రాణవాయువు కావాలని ప్రభుత్వానికి ఎస్‌ఓఎస్‌ పంపాం. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆసుపత్రికి ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. దాదాపు గంటన్నర పాటు సరఫరా నిలిచిపోవడంతో ఎనిమిది మంది రోగులు మరణించారు. మృతుల్లో ఒకరు మా సొంత డాక్టర్‌ కూడా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోవద్దని మేం కోరుకుంటాం. కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు’’ అని బత్రా ఆసుపత్రి యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా.. బత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అయిపోవడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు ఏప్రిల్‌ 24న కూడా ప్రాణవాయువు నిండుకోవడంతో ఆసుపత్రి ఎస్‌ఓఎస్‌ పంపింది. చివరి నిమిషంలో ట్యాంకర్లు చేరుకోవడంతో అప్పుడు ప్రమాదం తప్పింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని