OYO సీఈఓ రితేశ్‌ ఇంట విషాదం.. పెళ్లైన 3 రోజులకే తండ్రి మృతి

OYO Founder Ritesh Father Died: ఓయో సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ తండ్రి రమేశ్‌ అగర్వాల్‌ మృతి చెందారు. 20 అంతస్తు నుంచి పడి మరణించారు. రితేశ్‌కు పెళ్లైన మూడు రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది.

Published : 10 Mar 2023 20:03 IST

గురుగ్రామ్‌: ఓయో వ్యవస్థాపకుడు రితేశ్‌ ఇంట విషాదం నెలకొంది. రితేశ్‌ తండ్రి రమేశ్‌ అగర్వాల్‌ మృతి చెందారు. గురుగ్రామ్‌లోని 20వ అంతస్తు నుంచి పడి మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. రితేశ్‌ వివాహం జరిగిన మూడు రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 54లో ఉన్న డీఎల్‌ఎఫ్‌కు చెందిన ది క్రెస్ట్‌ సొసైటీలో రితేశ్‌ కుటుంబం నివాసముంటోంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రమేశ్‌ అగర్వాల్‌ 20వ అంతస్తు నుంచి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

బిల్డింగ్‌ పై నుంచి పడిన సమయంలో ఇంట్లో రమేశ్‌ అగర్వాల్‌ భార్య, రితేశ్‌ అగర్వాల్‌, ఆమె భార్య ఇంట్లో ఉన్నారు. పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదూ రాలేదని, ఎలాంటి సూసైడ్‌ నోటు కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. తన తండ్రి మరణం తమకు తీరని లోటు అని, ఈ విషాద సమయంలో కుటుంబానికి కాస్త వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. మార్చి 7న రితేశ్‌ వివాహం జరిగింది. దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహానికి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ మసయోషి సన్‌, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ, లెన్స్‌కార్ట్‌ నిర్వాహకులు పీయూష్‌ బన్సల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి వంటి కార్పొరేట్‌ ప్రముఖులు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు