Padma awards: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వీడియో వీక్షించండి

Padma awards: రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం వేడుకగా జరిగింది.

Published : 22 Mar 2023 21:13 IST

దిల్లీ: గణతంత్ర్య దినోత్సవం(Republic Day celebrations) వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల(Padma awards 2023) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) ఈ అవార్డులను ప్రదానం చేశారు.  ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. వీరిలో 50మందికి పైగా ప్రముఖులకు ఈరోజు పద్మవిభూషణ్‌, పద్మభూషన్‌, పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. మిగతా వారికి మరో సందర్భంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి అవార్డులను అందజేసి వారిని గౌరవించనున్నారు.

బుధవారం నిర్వహించిన  ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా కర్ణాటక మాజీ సీఎం ఎస్‌.ఎం.కృష్ణ, ప్రొఫెసర్‌ బాలకృష్ణ దోషి (మరణానంతరం) ఆయన కుటుంబ సభ్యులు పద్మవిభూషణ్‌ అందుకోగా.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, ప్రఖ్యాత ప్లేబ్యాక్‌ సింగర్‌ సుమన్‌ కల్యాణ్‌పుర్‌, ప్రొఫెసర్‌ కపిల్‌ కపూర్‌, ఆధ్యాత్మికవేత్త కమ్లేశ్‌ డి పటేల్‌ (తెలంగాణ) పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌రావు, చింతలపాటి వెంకటపతిరాజు, ఆచార్య ప్రకాశ్‌ చంద్రసూద్‌, డా మోదడుగు విజయ గుప్తా, పసుపులేటి హన్మంతరావు, బండి రామకృష్ణ, సీవీ రాజు, కోటా సచ్చిదానందతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఆయా రంగాల ప్రముఖులు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. 

ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్కడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్రం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్‌, 9 మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మ అవార్డులు వరించాయి.  ఆధ్యాత్మిక రంగం నుంచి చినజీయర్‌ స్వామి, కమలేష్‌ డి.పటేల్‌లను పద్మభూషణ్‌ పురస్కారాలు వరించగా.. ఎం.ఎం.కీరవాణి సహా ఏపీలో ఏడుగురికి, తెలంగాణలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో బుధవారం కొందరు రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకోగా.. మిగతా వారంతా మళ్లీ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పురస్కారాలను స్వీకరించనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని