Published : 15 Nov 2021 01:31 IST

Padma Shri: పాక్‌ సైనికుడికి పద్మశ్రీ అవార్డు.. ఎందుకంటే..?

 ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్‌ సాహసానికి గుర్తింపు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఓ కుర్రాడు సైనికాధికారి కావాలని కలలుగంటూ పాక్‌ సైన్యంలో చేరాడు.. కానీ, అక్కడ సైనికాధికారులు కింది స్థాయి ఉద్యోగులను హీనంగా చూడటాన్ని గమనించాడు. ఒక దశలో పాక్‌ సైన్యం స్వదేశీయులపైనే అత్యాచారాలు, లూఠీలు చేయడం అతనికి నచ్చలేదు. దీంతో ఆ సైన్యానికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఓ రోజు పాక్‌ను వీడి నేరుగా భారత్‌ సైనికుల వద్దకు వచ్చేశాడు. అతని రాకతో పాక్‌ సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం భారత్‌కు దక్కింది. ఫలితంగా బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో పాక్‌ అత్యంత అవమానకర స్థాయిలో లొంగిపోయింది. ఆ యువ సైనికుడి పేరు ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్‌. ఇటీవల ఆయన్ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

1970ల్లో ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్ అనే పాకిస్థానీ సైనికుడు సియాల్‌ కోట్‌ వద్ద అతి కష్టం మీద సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకొన్నాడు. అప్పుడతని జేబులో రూ.20 మాత్రమే ఉన్నాయి. పాక్‌ సైన్యం కీలక స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఇతర వివరాలకు సంబంధించిన పత్రాలు అతడి బూట్లల్లో దాచి తీసుకొచ్చాడు. అతడు నేరుగా భారత్‌ సైన్యం వద్దకు వెళ్లి తాను వచ్చిన పని ఏమిటో చెప్పాడు. అధికారులు మొదట అతడిని నమ్మలేదు. పాకిస్థానీ గూఢచారి అని అనుమానించారు. పఠాన్‌కోట్‌ సైనిక స్థావరానికి తరలించి గంటల కొద్దీ ప్రశ్నించారు. కానీ, ఆ సైనికుడి మాటల్లో నిజాయతీ ఉందని చివరికి అర్థం చేసుకొన్నారు. నేరుగా దిల్లీలోని ఓ రహస్య స్థావరానికి తరలించారు. 1971లో బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ వార్‌ ( బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం)కు కొన్ని నెలల ముందు జరిగిన ఘటన ఇది.

తూర్పు పాకిస్థాన్‌లో అరాచకాలు చూసి.. 

1971 మందు తూర్పు పాకిస్థాన్‌(ప్రస్తుతం బంగ్లాదేశ్‌) ప్రజలను పశ్చిమ పాకిస్థాన్‌లోని పాలకులు హీనంగా చూసేవారు. తూర్పు పాకిస్థాన్‌కు చెందిన  అవామీ లీగ్‌ ఎన్నికల్లో గెలిచినా.. పశ్చిమ పాకిస్థాన్‌లోని సైన్యం అధికారం అప్పజెప్పేందుకు నిరాకరించింది. అంతేకాదు తూర్పు పాకిస్థాన్‌ ప్రజలను అణచివేసేందుకు ప్రత్యేక దళాలను కూడా అక్కడకు పంపింది. ఈ ఘటనలు పాక్‌ అత్యున్నత దళం పారా బ్రిగేడ్‌లో పనిచేస్తున్న అలీ జహీర్ మనసు గాయపర్చాయి. దీనిని అడ్డుకోవాలంటే భారత్‌కు వెళ్లక తప్పదని గ్రహించాడు. షకర్గఢ్‌ నుంచి జమ్ము వైపు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకొన్నాడు.

మృత్యువును వెంట్రుకవాసిలో తప్పించుకుని..

అతడు ఒక రోజు సరిహద్దులు దాటి భారత్‌లో ప్రవేశిస్తుండగా.. వెనక నుంచి పాక్‌ సైన్యం కాల్పులు మొదలు పెట్టింది. ఏం జరుగుతోందో భారత్ సైన్యానికి అర్థంకాలేదు. వెంటనే ప్రతిదాడి మొదలుపెట్టింది. దీంతో అలీ జహీర్ అక్కడే ఉన్న ఒక నదిలో దూకేశాడు. అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకొని బీఎస్‌ఎఫ్‌ దళాలను కలిశాడు. అక్కడ అతడిని ప్రశ్నించిన అనంతరం విషయ తీవ్రత గ్రహించి దిల్లీకి తరలించారు. దిల్లీలో అతడిని సఫ్దార్‌గంజ్‌లోని ఓ ఇంట్లో రహస్యంగా ఉంచారు. మంచి సౌకర్యాలు కల్పించారు. సీనియర్‌ ఆర్మీ అధికారులు అతడిని కలిసి పలు విషయాలు తెలుసుకొన్నారు.

మ్యాప్‌లను చదివి దళాల కదలికలను గుర్తించడంలో జహీర్‌ నిష్ణాతుడన్న విషయం భారత అధికారులు గ్రహించారు. అంతేకాదు.. రాత్రి వేళల్లో దళాల కదలికలను నిర్దేశంచడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. దీంతో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధ సమయంలో త్రిపుర పక్కనే తూర్పు పాకిస్థాన్‌లో భారత్‌ ఏర్పాటు చేసిన ముక్తి వాహిని క్యాంప్‌కు ఆయన్ను పంపించారు. అక్కడ దాదాపు 850 మంది ముక్తివాహిని సైనికులు శిక్షణ పొందారు. అంతేకాదు..  పశ్చిమ పాకిస్థాన్‌ వైపు జరిగిన బ్యాటిల్‌ ఆఫ్‌ బసంతర్‌లో భారత దళాలు షకర్గఢ్‌ వద్దకు చొచ్చుకుపోవడానికి జహీర్‌ ఇచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడింది. భారత యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు కచ్చితమైన లక్ష్యాలను గుర్తించి దాడులు చేయడంతో పాక్‌ సైన్యానికి దిమ్మతిరిగింది. ఆ విమానాల్లో జహీర్‌ ఉన్నాడని అనుమానించింది. కానీ, వాటిల్లో జహీర్‌ లేడు. ఆయన మ్యాప్‌ల రూపంలో అందించిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి.

బంగ్లాదేశ్‌ వైపు సిల్హెట్‌ రీజియన్‌లో భారత్‌ ఏర్పాటు చేసిన సెకండ్‌ ఆర్టలరీ దళం పాక్‌ సైన్యంపై చేసిన దాడుల్లో  ఆయన కీలక పాత్ర పోషించారు. ముక్తివాహిని (జెడ్‌) సేనలు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఈ దళం శతఘ్ని దాడులు నిర్వహించింది. జహీర్‌ సోదరుడు కూడా బంగ్లాదేశ్‌ తరపున పోరాడారు.

పాకిస్థాన్‌లో ఇప్పటికీ జహీర్‌ పేరిట మరణశిక్ష ఉత్తర్వులు ఎదురు చూస్తున్నాయి. ఆ యుద్ధానంతరం పాక్‌ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించింది.  కానీ ఆయన అక్కడ లేకపోవడంతో దానిని అమలు చేయలేదు. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్‌లో స్థిరపడ్డారు. జహీర్‌ మంచి రచయిత కూడా.

భారత్‌ ప్రజలు నన్ను మర్చిపోలేదు..!

‘‘నన్ను, నేను చేసిన సాయాన్ని కాలక్రమంలో మర్చిపోయారనుకున్నాను. కానీ, భారతీయులు, ఇక్కడి ప్రభుత్వం ఎప్పటికీ మరిచిపోలేదని తెలిసింది. నా కల సాకారమైంది. నేను చేసిన చిన్న సహాయాన్ని కూడా గుర్తుంచుకొని సత్కరించారు’’ అని ఇటీవల పద్మశ్రీ అవార్డు స్వీకరించిన లెఫ్టినెంట్‌ కల్నల్‌(రిటైర్డ్‌) ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్‌ ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బంగ్లా యుద్ధ సమయంలో లొంగిపోయిన 90 వేల మంది పాక్‌ సైనికుల ప్రాణాలను భారత్‌ కాపాడిందని జహీర్‌ చెప్పారు. లేకపోతే ముక్తివాహిని సేనల చేతిలో వారు అంతమయ్యేవారని అన్నారు.  ఇప్పటికీ తన కోసం పాకిస్థాన్‌లో మరణశిక్ష ఉత్తర్వులు ఎదురు చూస్తున్నాయని జహీర్‌ వెల్లడించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని